‘రాజాసాబ్‌’, ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ నిర్మాతలకు ఊరట.. టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు కీలక తీర్పు!

‘రాజాసాబ్‌’, ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ నిర్మాతలకు ఊరట.. టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు కీలక తీర్పు!

‘రాజాసాబ్‌’, ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్రనిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలకు సంబంధించి సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్‌ ఛేంజర్‌, అఖండ2 చిత్రాలకే పరిమితం చేసింది. టికెట్ దరల పెంపు కోరుతూ సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది.

నిర్మాతలకు హైకోర్టులో ఊరట

గత నెలలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపై టికెట్ రేట్ల పెంపు ఉండదు అని ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు, గతంలో కొన్ని చిత్రాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఈ సినిమాలకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో 'రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాల నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం జరిగిన విచారణలో నిర్మాతలకు బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ధరల నియంత్రణ ఉత్తర్వులు కేవలం పుష్ప-2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ-2 చిత్రాలకు మాత్రమే పరిమితమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

ప్రభుత్వంపైనే తుది నిర్ణయం

టికెట్ ధరల పెంపు , ప్రత్యేక షోల అనుమతి కోసం నిర్మాతలు పెట్టుకున్న వినతులను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా కోర్టుకు తెలిపారు. 

ఎందుకు ఈ పెంపు అవసరం?

భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో, పెట్టుబడిని తిరిగి రాబట్టేందుకు టికెట్ రేట్ల పెంపు , బెనిఫిట్ షోలు అత్యవసరమని నిర్మాతలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. జనవరి 8న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఆ ప్రీమియర్ షో టికెట్ను.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 800 రూపాయలు (జీఎస్టీ అదనం), మల్టీప్లెక్స్ల్లో 1000 రూపాయలకు (జీఎస్టీ అదనం) అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అంతేకాకుండా.. జనవరి 9న తెల్లవారుజామున 4 గంటల షోకు కూడా అనుమతి ఇవ్వాలని కోరింది. 

 డే1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెగ్యులర్ టికెట్ ధరపై 102 రూపాయల పెంపును, మల్టీప్లెక్స్ టికెట్ ధరపై 132 రూపాయల పెంపును కోరుతూ ‘ది రాజా సాబ్’ సినిమా నిర్మాణ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రికి, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఈ లేఖ రాశారు. ఇప్పుడు హైకోర్టు తాజా తీర్పుతో సంక్రాంతి రేసులో ఉన్న ఈ పెద్ద సినిమాలకు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏ స్థాయిలో ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి!