T20 World Cup 2026: ఏడుగురు ఆల్ రౌండర్లతో కివీస్.. వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన

T20 World Cup 2026: ఏడుగురు ఆల్ రౌండర్లతో కివీస్.. వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ 2026కు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్ ను బుధవారం (జనవరి 7) ప్రకటిస్తూ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 15 మంది ఆటగాళ్లలో సాంట్నర్ తో సహా మొత్తం ఐదుగురు గాయపడిన ప్లేయర్స్ కు ఎంపిక చేసింది. ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్,  మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ పూర్తిగా ఫిట్ నెస్ సాధించపోయినా ఎంపిక చేసింది. వీరికి పెద్ద గాయాలు కాదని వరల్డ్ కప్ సమయానికి కోలుకుంటారని న్యూజిలాండ్ క్రికెట్ (NZC) ధృవీకరించింది.

వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లకు స్టార్ ఫాస్ట్ బౌలర్లు లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ అందుబాటులో ఉండరని స్పష్టం చేసింది. వీరిద్దరూ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ కారణంగా పితృత్వ సెలవులను కోరగా.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించింది. స్క్వాడ్ విషయానికి వస్తే ఇటీవలే ఆస్ట్రేలియాపై సెంచరీ చేసినా రాబిన్సన్ స్క్వాడ్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ రూపంలో టాపార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది.  మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్,జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్రరూపంలో ఏడుగురు ఆల్ రౌండర్లు ఉండడం విశేషం.   

"ఎప్పటిలాగే జట్టు బ్యాలన్స్ ఉండేలా చూసుకున్నాం. బ్యాటింగ్‌లో మాకు చాలా డెప్త్ ఉంది. పరిస్థితులకు అనుగుణంగా మారగల నాణ్యమైన బౌలర్లు.. అదనంగా ఐదుగురు ఆల్ రౌండర్లు ఉన్నారు. ఇది అనుభవమైన జట్టు. ప్లేయర్స్ అందరికీ ఉపఖండంలో ఆడిన అనుభవం ఉంది". అని కోచ్ రాబ్ వాల్టర్ అన్నారు. వరల్డ్ కప్ లో గ్రూప్ 'డి' లో న్యూజిలాండ్ ఉంది. ఇదే గ్రూప్ లో ఆఫ్ఘనిస్తాన్, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ జట్లు ఉన్నాయి. కివీస్ వరల్డ్ కప్ లో తమ తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 8న చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతుంది. 

2026 టీ20 ప్రపంచ కప్ కు న్యూజిలాండ్ జట్టు:

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే వెల్లింగ్టన్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి 

ట్రావెలింగ్ రిజర్వ్: కైల్ జామిసన్