French Open 2024: రేపటి నుంచే ఫ్రెంచ్ ఓపెన్ 2024.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే

French Open 2024: రేపటి నుంచే ఫ్రెంచ్ ఓపెన్ 2024.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే

ఫ్రెంచ్ ఓపెన్ 2024 ఆదివారం(మే 26) నుంచి ప్రారంభం కానుంది. 14 టైటిళ్లతో క్లే-కోర్టు రారాజుగా పిలవబడుతున్న రాఫెల్ నాదల్‌పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. నాదల్.. తన తొలి పోరులో ఇటాలియన్ ఓపెన్ 2024 ఛాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. మరోవైపు, సింగిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్లు నోవాక్ జకోవిచ్(సెర్బియా), ఇగా స్విటెక్(పోలాండ్) మరోసారి టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు. 

ఈ ఈవెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ పురుషుల సింగిల్స్‌లో పోటీలో ఉన్నాడు. నాగల్ ఫస్ట్ రౌండ్‌లో రష్యాకు చెందిన కరెన్ ఖచనోవ్‌తో తలపడనున్నాడు. గత సీజన్‌లో క్యాస్పర్ రూడ్‌ను ఓడించి మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ సొంతం చేసుకున్న జొకోవిచ్..  హ్యూగ్స్ హెర్బర్ట్‌తో మొదటి మ్యాచ్‌ ఆడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌ విషయానికొస్తే.. వరల్డ్‌ నెం.1, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ మరోసారి ఫైనల్‌ దూసుకెళ్లేలా ఉంది.

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:

భారత టెన్నిస్ అభిమానులు ఫ్రెంచ్ ఓపెన్ 2024 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను సోనీ స్పోర్ట్స్ 2, 3, 4, 5 టీవీ ఛానెళ్లలో చూడవచ్చు. అలాగే, SonyLiv యాప్, వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఆస్వాదించవచ్చు.

టాప్ సీడ్స్ వీరే

పురుషుల సింగిల్స్: నోవాక్ జొకోవిచ్, జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్, డేనియల్ మెద్వెదేవ్, ఆండ్రీ రుబ్లెవ్, కాస్పర్ రూడ్, హుబెర్ట్ హుర్కాజ్, స్టెఫనోస్ టిసిప్స్. 

మహిళల సింగిల్స్: ఇగా స్వియాటెక్, అరీనా సబాలెంకా, కోకో గౌఫ్, ఎలెనా రైబాకినా, వొండ్రూసోవా, మరియా సక్కరి, క్విన్వెన్ జెంగ్, ఓనస్ జుబైర్, డారియా కసట్కినా.