తేమ తక్కువుండడం వల్లే వర్షం పడలేదు..క్లౌడ్ సీడింగ్‌‌‌‌పై ఐఐటీ కాన్పూర్

తేమ తక్కువుండడం వల్లే వర్షం పడలేదు..క్లౌడ్ సీడింగ్‌‌‌‌పై ఐఐటీ కాన్పూర్
  • ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్‌‌‌‌పై ఐఐటీ కాన్పూర్ ప్రకటన  
  • ట్రయల్స్ వాయిదా వేసినట్టు వెల్లడి  

న్యూఢిల్లీ: ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ చేసినప్పటికీ, మేఘాల్లో తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల వర్షం పడలేదని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. ‘‘ఢిల్లీలో మంగళవారం రెండుసార్లు క్లౌడ్ సీడింగ్ చేశాం. కానీ ఆ టైమ్‌‌‌‌లో మేఘాల్లో తేమ 15 నుంచి 20 శాతం మాత్రమే ఉంది. దీంతో పెద్దగా వర్షం పడలేదు. 

నోయిడా, గ్రేటర్ నోయిడాలో చిరుజల్లులు కురిశాయి. వర్షం పడనప్పటికీ, క్లౌడ్ సీడింగ్‌‌‌‌తో గాలి కాలుష్యం కొంతమేర తగ్గింది. క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ తర్వాత గాలి నాణ్యత పెరిగినట్టు డేటాను బట్టి తెలుస్తున్నది. క్లౌడ్ సీడింగ్‌‌‌‌కు ముందు మయూర్ విహార్, కరోల్‌‌‌‌బాగ్, బురారీలో పీఎం2.5 లెవల్స్ వరుసగా 221, 230, 229 ఉండగా.. క్లౌడ్ సీడింగ్ తర్వాత 207, 206, 203కి తగ్గాయి. 

ఇక పీఎం10 లెవల్స్ 207, 206, 209 ఉండగా.. 177, 163, 177కి తగ్గాయి” అని వెల్లడించింది. ఈ ట్రయల్స్ ద్వారా తమకు విలువైన సమాచారం లభించిందని, భవిష్యత్తు రీసెర్చ్‌‌‌‌కు ఇదెంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. మేఘాల్లో తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల బుధవారం నిర్వహించాల్సిన క్లౌడ్ సీడింగ్‌‌‌‌ను వాయిదా వేసినట్టు తెలిపింది. 

కాగా, మేఘాల్లో తేమ శాతం తక్కువగా ఉంటే వర్షం పడే అవకాశం తక్కువగా ఉంటుందని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర ఆగ్రవాల్ తెలిపారు. తాము ట్రయల్‌‌‌‌లో సక్సెస్ కానప్పటికీ, విలువైన సమాచారం సేకరించామని పేర్కొన్నారు. 

ఇదో పబ్లిసిటీ: ఆప్ విమర్శ

ఢిల్లీ సర్కార్ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నదని ఆప్ విమర్శించింది. ‘‘ఢిల్లీలోని పలు ఏరియాల్లో క్లౌడ్ సీడింగ్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఒక్క ఏరియాలోనూ వర్షం పడలేదు. ఢిల్లీ వాతావరణ పరిస్థితులకు క్లౌడ్ సీడింగ్ విధానం సరికాదని మూడు కేంద్ర సంస్థలు ఇప్పటికే తెలిపాయి. అయినప్పటికీ క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల వచ్చే లాభమేంటి?” అని ఆప్ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు.