ఆరంతస్తుల టవర్ నేలమట్టం... ఐలాపూర్ లో 861 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్

ఆరంతస్తుల టవర్ నేలమట్టం... ఐలాపూర్ లో 861 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ లో ఆక్రమణాల తొలగింపు రెండో రోజు ఆదివారం కూడా కొనసాగింది. రెవెన్యూ, మున్సిపల్  అధికారులతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఐలాపూర్ లో 861 ఎకరాల ప్రభుత్వ భూమికి అధికారులు దగ్గరుండి ఫెన్సింగ్  వేయించారు. అమీన్ పూర్  మండలంలో హైడ్రా అధికారులు శనివారం భారీ ఆపరేషన్  నిర్వహించి బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల అక్రమ భూబాగోతాన్ని గుర్తించి ఆయా నిర్మాణాలను తొలగించడమే కాకుండా రూ.720 కోట్ల విలువైన భూములను రక్షించిన విషయం తెలిసిందే. అలా శనివారం ఉదయం మొదలుపెట్టిన ఆక్రమణల తొలగింపు రాత్రి వరకు కొనసాగింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మళ్లీ కూల్చివేతల పర్వాన్ని హైడ్రా మొదలుపెట్టింది. సాయంత్రం వరకు ఆరంతస్తుల 2 టవర్లను నేలమట్టం చేసింది. 

ముఖిమ్, అతని సోదరుడు అజీమ్  అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల బిల్డింగ్ లను పూర్తిగా తొలగించేందుకు రెండు రోజుల టైం పట్టింది. పక్కనే ఉన్న అపార్టుమెంట్లకు ఎలాంటి నష్టం జరగకుండా హైడ్రా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ కూల్చివేతలు నిర్వహించారు. అయితే, ఐలాపూర్  గ్రామంలోని 1 నుంచి 220 స‌ర్వే నంబర్ల వరకు 1,263 ఎక‌రాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 861 ఎకరాలను హైడ్రా పరిరక్షించి ఆ భూమి చుట్టు ఫెన్సింగ్  వర్క్ పూర్తి చేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించిన హైడ్రా అధికారులకు ఐలాపూర్ గ్రామస్తులు మద్దతుగా నిలిచారు.