ILT20 2024: జనవరి 19 నుంచి ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్.. టైటిల్ వేటలో 6 జట్లు

ILT20 2024: జనవరి 19 నుంచి ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్.. టైటిల్ వేటలో 6 జట్లు

క్రికెట్‌ ప్రేమికులారా..! మీకో శుభవార్త. భారత్- ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ ముగిసిన గంటల వ్యవధిలోనే మరో టోర్నీ మొదలుకాబోతోంది. శుక్రవారం (జనవరి 19) నుంచి యూఏఈ వేదికగా ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్ షురూ కానుంది. ఈ టోర్నీ 30 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గల్ఫ్ జెయింట్స్‌తో షార్జా వారియర్స్ తలపడనుంది.

మొత్తం 30 రోజుల పాటు సాగే ఈ టోర్నీ ఫిబ్రవరి 17న దుబాయ్‌ వేదికగా జరిగే ఫైనల్‌తో ముగియనుంది. నాకౌట్ మ్యాచ్ ల సహా మొత్తం 34 గేమ్‌లు ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లు మూడు వేదికలుగా జరగనున్నాయి. దుబాయ్ 15, అబుదాబి 11, షార్జా 8  మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, న్యూజిలాండ్ స్పీడ్ గన్ ట్రెంట్ బౌల్ట్‌, విండీస్ వీరులు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావోలతో పాటు కోరీ అండర్సన్, దసున్ షనక, రహ్మానుల్లా గుర్బాజ్, సామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లీ, అలెక్స్ హేల్స్, టామ్ కర్రాన్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మేయర్, జేమ్స్ విన్స్, క్రిస్ వోక్స్, మార్టిన్ గప్టిల్ వంటి పలువురు అంతర్జాతీయ స్టార్లు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. ప్రారంభ ఎడిషన్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ను ఓడించి గల్ఫ్ జెయింట్స్ విజేతగా అవతరించింది.

ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం జట్లు: 6

  • షార్జా వారియర్స్ (కాప్రి గ్లోబల్)
  • గల్ఫ్ జెయింట్స్ (కాప్రి గ్లోబల్)
  • దుబాయ్ క్యాపిటల్స్ (GMR)
  • ఎంఐ ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్)
  • డిజర్ట్ వైపర్స్ (లాన్సర్ క్యాపిటల్)
  • అబుదాబి నైట్ రైడర్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్)