తెలంగాణ అభివృద్ధి కోసం జగన్‌ను కూడా ఎదురిస్తా

తెలంగాణ అభివృద్ధి కోసం జగన్‌ను కూడా ఎదురిస్తా

హైదరాబాద్: త‌న‌ స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు షర్మిల. బుధవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన ఆమె ‘‘ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే పిల్లలను కన్నాను. సీఎం కేసీఆర్‌, బీజేపీ నేత విజయశాంతి ఎక్కడ పుట్టారు?’’ అని ప్రశ్నించారు. దివంగత మాజీ సీఎం జయలలిత ఎక్కడ పుట్టి, ఎక్కడ సీఎం అయ్యారో అందరికీ తెలుసని అన్నారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని స్పష్టం చేశారు.

తెలంగాణలో పార్టీ పెట్టడం సీఎం జగన్‌కు ఇష్టం లేదని, జగన్‌తో తనకు పార్టీ పరమైన విభేదాలు మాత్రమేనని ఆమె చెప్పారు. తనకు ఎందుకు వైసీపీలో ప్రాధాన్యత ఇవ్వలేదో జగన్‌ను అడగాలని, తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని మరోసారి షర్మిల స్పష్టం చేశారు. ఉద్యమం అంటూ ఒకరు.. మతం అంటూ మరొకరు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. తెలంగాణ అభివృద్ధిపై ఎవరికీ చిత్తశుద్ధిలేదని ఆక్షేపించారు. అతిత్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని వెల్లడించారు. పార్టీపై భర్త అనిల్‌ పూర్తి సహకారం ఉందని, త‌ల్లి విజయమ్మ పూర్తి మద్దతు ఉందని ఆమె చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్‌ను ఎదురించడానికైనా సిద్ధమని స్పష్టత ఇచ్చారు. పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు దాకా తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు. తెలంగాణలో రాజన్న పథకాలనే కాపీ కొట్టారని షర్మిల ఆరోపించారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని , గొర్రెలు, బర్రెలు ఇవ్వడంకన్నా ఉద్యోగాలపై దృష్టిపెట్టలేదని విమ‌ర్శించారు. కోవిడ్‌ విషయంలో ఆస్పత్రులు లక్షలు వసూలు చేస్తే.. ఆస్పత్రుల దోపిడీపై కనీసం సీఎం దృష్టిపెట్టలేకపోయార‌న్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పారు. హైదరాబాద్‌తో నాకు విడదీయరాని అనుబంధం ఉందని, త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తాన‌ని, అమరవీరుల కుటుంబాలను కలుస్తాన‌ని చెప్పారు ష‌ర్మిల‌. లోటస్‌పాండ్‌లోని త‌న‌ నివాసం నుంచే పార్టీ ప్రస్థానం మొదలవుతుందని వెల్ల‌డించారు.