గాయమంటూ దొంగ నాటకాలు.. పాకిస్థాన్ ఓపెనర్పై రెండేళ్ల బ్యాన్.. PCB విచారణ!

గాయమంటూ దొంగ నాటకాలు.. పాకిస్థాన్ ఓపెనర్పై రెండేళ్ల బ్యాన్.. PCB విచారణ!

Imam-ul-Haq Ban: పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్-వుల్-హక్ అంతర్జాతీయ కెరీర్ తీవ్ర ప్రమాదంలో పడింది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో గాయం పేరుతో దొంగ నాటకలు ఆడారనే తీవ్ర ఆరోపణలతో అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఏకంగా 2 ఏళ్ల పాటు బ్యాన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఇమామ్, రెండో టెస్టులో పిక్క కండరాల గాయం (Calf Injury) నెపంతో రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు దిగలేదు. కానీ అతను నిజమైన గాయంతో బాధపడటం లేదని, కేవలం బ్యాటింగ్ నుంచి తప్పించుకునేందుకే డ్రామా ఆడాడని పాక్ క్రికెట్ బోర్డు (PCB) అనుమానిస్తోంది.  

పీసీబీ హై-లెవెల్ ఇంక్వైరీ: 

ఇమామ్ ఇలా గాయం పేరుతో డ్రామాలు ఆడటం ఇది మొదటిసారి కాదని తెలుస్తోంది. మార్చి 2025లో న్యూజిలాండ్ పర్యటనలోనూ ఇండోర్ నెట్ ప్రాక్టీస్ సమయంలో కుడి కాలి వేలికి గాయమైందంటూ మెడికల్ టీమ్‌ను తప్పుదోవ పట్టించి జట్టు నుంచి తప్పుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా లార్డ్స్ టెస్టులో కూడా అదే పునరావృతం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీబీ, ఇమామ్‌పై విచారణకు ఒక హై-లెవెల్ కమిటీని నియమించింది. విచారణలో అతడు దోషిగా తేలితే 1 నుంచి 2 ఏళ్ల పాటు క్రికెట్ ఆడకుండా కఠినంగా నిషేధించనున్నారు.

మహమ్మద్ రిజ్వాన్ కెరీర్ ఎండ్ కార్డ్: 

మరోవైపు స్టార్ వికెట్ కీపర్, పాక్ మాజీ వైట్ బాల్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ పరిస్థితి కూడా అత్యంత దారుణంగా తయారైంది. మూడో టెస్టుకు ముందే పీసీబీ జట్టు నుంచి తొలగించి పాకిస్థాన్‌కు పంపించిన 7 గురు ఆటగాళ్లలో రిజ్వాన్ కూడా ఉన్నాడు. జట్టులో క్రమశిక్షణారాహిత్యంతో ప్రవర్తించడం, మైదానంలో బాధ్యతారాహిత్యంగా చెత్త షాట్లు కొడుతూ వికెట్ పారేసుకోవడంపై పాక్ బోర్డు సీరియస్ అయింది. దీంతో రిజ్వాన్ అంతర్జాతీయ కెరీర్‌కు దాదాపు ఎండ్ కార్డ్ పడినట్లేనని, సమీప భవిష్యత్తులో అతను మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు లేవని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

పాక్ క్రికెట్‌లో ఊచకోత.. షాక్‌లో ఆటగాళ్లు: 

ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన పరాజయాల తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏకంగా ఏడుగురు ప్లేయర్లను అర్ధాంతరంగా టూర్ నుంచి తప్పించి స్వదేశానికి పంపడంతో లంక, ఇంగ్లాండ్ సిరీస్‌లు ఆడుతున్న ఆటగాళ్లు షాక్‌లో ఉండిపోయారు. ఒకవైపు డ్రెస్సింగ్ రూమ్ వివాదాలు, మరోవైపు ఇమామ్, రిజ్వాన్ వంటి సీనియర్లపై కఠిన చర్యలతో పాక్ క్రికెట్‌లో ప్రస్తుతం తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.