అలర్ట్: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..

అలర్ట్: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..

ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భిన్న పరిస్థితులు కొనసాగుతున్నాయని.. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం తీవ్రంగా ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని.. ఇది రాగల  48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అన్నారు.అల్పపీడనం నుండి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు అధికారులు. వీటి ప్రభావంతో బుధవారం ( మే13 ) కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 

ఈ క్రమంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని.. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని... చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు అధికారులు. మరోవైపు అల్లూరి జిల్లా జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్నిప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు అధికారులు.