రాష్ట్రంలో మరో 2 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ ప్రాంతం నుంచి తక్కువ ఎత్తులో రాష్ట్రంలోకి బలమైన గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడే చాన్స్ ఉందని ప్రకటించింది. బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. నిన్న ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాలో వర్షాలు కురిశాయి. ఇవాళ ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కొన్ని చోట్ల వర్షాలు పడుతాయని అధికారులు వెల్లడించారు.
గోదావరి మరోసారి ఉగ్రరూపం
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు భద్రాచలం దగ్గర గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరిగింది. భద్రచలం దగ్గర గోదావరి నీటిమట్టం 51 అడుగులు దాటింది. ప్రస్తుతం 13 లక్షల 55 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి ఉగ్రరూపం దాల్చటంతో భద్రచలం నుంచి పలు ఊర్లకు రాకపోకలు నిలిచిపోయ్యాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల వెళ్లే రోడ్లపై వరద ప్రవహిస్తోంది. తూరుబాక, నెల్లిపాక, బూర్గంపాడు మండలం సారపాక వద్ద రోడ్డపైకి భారీగా వరద చేరింది. కూనవరం, వీఆర్ పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రాజెక్టులోకి వరద నీరు
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చాలా గ్రామాల్లో రోడ్లు తెగిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. నిర్మల్ జిల్లాలో కురిసిన వర్షానికి కడెం ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక గేటు ఎత్తి నీటికి వదుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 7 వందల అడుగుల కాగా ప్రస్తుతం 694 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఆదిలాబాద్ లోని సాత్నాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3 వందల క్యూసెక్కలు కాగా ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు పెన్ గంగా నదికి వరద కొనసాగుతోంది. చెనాక-కోరాట బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో 55 వేల క్యూసెక్కులుగా ఉంది.
