రుతుపవనాలు ఆలస్యం అవుతుండడం, ఎల్‌నినో ప్రభావం మొదలవడంతో ఈ వర్షాకాలంలో వానలు చాలా తక్కువగా కురుస్తాయని ఐఎండీ ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యన వర్షపాత పరిస్థితులపై ఐఎండీ తాజా అంచనాలను శుక్రవారం (మూ 29) విడుదల చేసింది.
కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం లేదని పేర్కొంది. తెలంగాణ, మహారాష్ట్ర సహా మధ్యభారతంలోని మాన్సూన్ కోర్ జోన్ రాష్ట్రాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
దీర్ఘకాలిక సగటు వర్షపాతమైన 94 శాతం కన్నా తక్కువ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. జూన్‌లో మాత్రం రాష్ట్రంలోని తూర్పు, మధ్య జిల్లాల్లో సాధారణం వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు పేర్కొంది. అదే సమయంలో ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం ఉంటుందని అంచనాల్లో వెల్లడించింది.
దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం చూస్తే.. లోటు వర్షపాతమే ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావం మొదలైందని, మాన్సూన్ ఎంటరయ్యాక అది బలపడుతుందని పేర్కొంది. మరోవైపు జూన్‌లోనూ తెలంగాణలోని సూర్యాపేట, ఉమ్మడి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశమున్నట్టు పేర్కొంది.
