
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో అతి త్వరలోనే ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా ఆంధ్రా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ కోస్తా ఆంధ్రా తీరం వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది. దీని ప్రభావంతో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, అల్పపీడనం ఏర్పడిన రోజు (ఈ నెల 13) నుంచి మూడు రోజుల పాటు అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 13, 14, 15వ తేదీలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అన్ని జిల్లాల్లోనూ వర్షం..
శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా తొర్రూరు (హయత్‌నగర్)లో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా పెద్దఅంబర్‌పేటలో 9.6, బాలాపూర్ ఏవియేషన్ అకాడమీ వద్ద 9.5, హయత్ నగర్ డిఫెన్స్ కాలనీ వద్ద 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
మెదక్ జిల్లా కాగజ్‌మద్దూరులో 7.2, భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌లో 6.5, నారాయణపేట జిల్లా కోస్గిలో 6.5, మహబూబ్‌నగర్‌జిల్లా జానంపేటలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. హయత్‌నగర్‌లో గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, సికింద్రాబాద్, నాంపల్లి, మారేడుపల్లి, హిమాయత్‌నగర్, సైదాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం జోరుగా కురిసింది.
7 జిల్లాల్లో అధికం.. 6 జిల్లాల్లో లోటు
రాష్ట్రంలో ఇప్పటివరకు 7 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు 422.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 399.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ లెక్కల ద్వారా తెలుస్తున్నది. మంచిర్యాల జిల్లాలో 37 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. ఆ తర్వాత పెద్దపల్లిలో 33 శాతం, జగిత్యాలలో 28, జయశంకర్ భూపాలపల్లిలో 25, నిర్మల్‌లో 24, నిజామాబాద్‌లో 22 శాతం చొప్పున లోటు వర్షపాతం రికార్డ్ అయింది.
ఇక, నాగర్‌కర్నూలు జిల్లాలో సాధారణం కన్నా 41 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 39 శాతం, రంగారెడ్డిలో 34, యాదాద్రిలో 30, వనపర్తిలో 24, నారాయణపేటలో 24, సిద్దిపేటలో 21 శాతం చొప్పున అధిక వర్షాలు కురిశాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 41 రోజులు (రెయినీ డేస్) వర్షాలు పడ్డాయి. అత్యల్పంగా సూర్యాపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో 18 రోజుల పాటు వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 36 రెయినీ డేస్ ఉన్నాయి.