ప్రభావం చూపని భారత్ బంద్

ప్రభావం చూపని భారత్ బంద్
  • జార్ఖండ్ రాష్ట్రం మినహా మిగతా రాష్ట్రాల్లో కనిపించని బంద్ ఎఫెక్ట్
  • దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జనజీవనం సాధారణం

న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీంకు  వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా  పలు సంస్థలు  ఇచ్చిన భారత్ బంద్  ఎలాంటి ప్రభావం చూపలేదు.  ఒక్క జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం  విద్యాసంస్థలు  బంద్ పాటించాయి. ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ ఒక్క  రాష్ట్రం సహా  మిగితా ఎక్కడ  కూడా  పెద్దగా ఎఫెక్ట్ కనిపించలేదు. అన్ని రాష్ట్రాల్లో జనజీవనం సాధారణంగా  కనిపించింది. ఢిల్లీకి  వచ్చే అన్ని రూట్లలో  పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ  గురుగ్రామ్  ఎక్స్ ప్రెస్ వే  సహా  పలు చోట్ల   భారీగా ట్రాఫిక్ కనిపించింది. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా  తనిఖీ చేయడంతో  ట్రాఫిక్ జామ్  అయింది. మరోవైపు ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, హైదరాబాద్,  చెన్నై, బెంగళూరులో  ఎక్కడా బంద్ ఎఫెక్ట్ కనిపించలేదు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ యధాతథంగా  నడిచింది. అలాగే విద్యా సంస్థలు కూడా కొనసాగాయి. 
 

కొన్నిచోట్ల స్వల్ప నిరసనలు

చెన్నై, ఢిల్లీ  సహా కొన్ని రైల్వే స్టేషన్ల  దగ్గర స్వల్ప నిరసనలు  కొనసాగాయి. భారత్ బంద్ పిలుపుతో రైల్వే శాఖ  ముందు జాగ్రత్తగా  కొన్ని రైళ్లను రద్దు చేసింది. అల్లర్లు జరుగుతాయని అనుమానించి కొన్ని రూట్లలో  రైళ్లు రద్దు  చేయడంతో ప్రయాణికులు  ఇబ్బందులు పడ్డారు. భారత్ బంద్ పిలుపు ప్రభావం మొత్తం 539 రైళ్లపై పడింది. దేశ వ్యాప్తంగా 181 ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని దారి మళ్లించారు.  కొన్ని స్టేషన్లలో  ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. జీఆర్పీ , ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పటిష్ట  బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణికులను అణువణువునా సోదా చేసిన తర్వాతే రైల్వే స్టేషన్లలోకి అనుమతిస్తున్నారు.  మరోవైపు రైళ్లు  రద్దవడంతో చాలా ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు  పడ్డారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లిన వారికి సైతం  ఇబ్బందులు తప్పడం లేదు. రైళ్ల కోసం స్టేషన్లలోనే  పడిగాపులు కాస్తున్నారు. భారీ సంఖ్యలో రైళ్లు రద్దు కావడమో లేదా.. దారి మళ్లించడం వల్ల ఆలస్యంగా నడుస్తుండడం వల్ల వారణాసికి వెళ్లిన భక్తులు, ప్రయాణికులు అక్కడి రైల్వే స్టేషన్ లో పడిగాపులు కాస్తూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కొనసాగుతున్న నిరసనలు

అగ్నిపథ్ పై  దేశ వ్యాప్త  నిరసనలు కొనసాగుతున్నాయి.  పథకాన్ని రద్దు చేయాలని  కోరుతూ  ఢిల్లీ జంతర్ మంతర్  వద్ద  కాంగ్రెస్ దీక్ష చేపట్టింది.  దీక్షలో  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. హింసామార్గంలో  నడిచే ఈ ప్రభుత్వాని  గద్దెదించాల్సిన  అవసరం ఉందని ప్రియాంక గాంధీ  అన్నారు. నకిలీ జాతీయవాదులెవరో గుర్తించాలని యువతకు సూచించారు. నిజమైన దేశభక్తిని చూపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే యువత లక్ష్యం కావాలన్నారు. సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నవారికి తమ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిర్వహించిన కాంగ్రెస్ హింసా మార్గంలో నడిచే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. 

వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ అని చెప్పి.. నో ర్యాంక్.. నో పెన్షన్ విధానం తీసుకొచ్చారు

వన్ ర్యాంక్... వన్ పెన్షన్  అన్న మోడీ.. నో ర్యాంక్   నో పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారని  ఆరోపించారు ఆర్జేడీ నేత తేజస్వీ  యాదవ్. ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగానే అగ్నిపథ్ ను తీసుకొచ్చారని తేజస్వీ యాదవ్ విమర్శించారు.  దేశ యువత శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అగ్నిపథ్ ను సైన్యంలోని ఉన్నతాధికారుల నియామకాలను ఎందుకు వర్తింపజేయడం లేదని తేజస్వి ప్రశ్నించారు. 

ఎన్ని బుల్డోజర్లతో నిరసనకారుల ఇండ్లు కూల్చుతారు ?

ఇక ఎన్నిబుల్డోజర్లతో  నిరసనకారుల ఇండ్లు  కూల్చుతారంటూ ప్రశ్నించారు ఎంఐఎం అధినేత ఒవైసీ. ప్రధాని మోడీ తప్పుడు నిర్ణయాల వల్లే యువత రోడ్లపైకి వచ్చారన్నారు. దేశంలోని యువతను నాశనం చేసేందుకు ఓ మార్గం దొరికిందన్నారు. నిరసనకారుల ఇళ్లు ధ్వంసం చేసేందుకు ఎన్ని బుల్డోజర్లు వాడతారని నిలదీశారు. బుల్డోజర్ కల్చర్ మంచిదికాదన్నారు అసదుద్దీన్ ఒవైసీ.
యువత పట్ల కేంద్రం మొండిగా వ్యవహరించొద్దని అన్నారు సచిల్ పైలెట్. బీజేపీ ప్రభుత్వం ఎవరి మాట వినడం లేదన్నారు. దేశానికి కాపాలాదారుడిగా ఉంటానన్న వ్యక్తే మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం తన ఆలోచన 130 కోట్ల ప్రజలపై రుద్దడం సబబు కాదని సచిన్ పైలెట్ అభిప్రాయపడ్డారు. నిరసనలు చేస్తున్న యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు అధిర్ రంజన్ చౌదరి.
అగ్నిపథ్ ను కేంద్రం పునర్ పరిశీలించాలని కోరారు బహుజన సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి. అగ్నిపథ్ పథకం.. నిబంధనలను చూసి దేశ యువత ఆగ్రహంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. యువత సంయమనం పాటించాలని సూచించారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పథకాన్ని రద్దు చేయాల్సిందేనని విద్యార్థులు పట్టుబడుతున్నారు.