ఇంపాక్ట్ సమిట్ ఫిబ్రవరి 19న ప్రారంభం..ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఇంపాక్ట్ సమిట్ ఫిబ్రవరి 19న ప్రారంభం..ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • యూఎన్ సెక్రటరీ జనరల్, ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రసంగాలు
  • పలువురు టెక్ దిగ్గజాల స్పీచ్ లు

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన ‘భారత్ ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక ‘భారత్ మండపం’ వేదికగా ఈ భారీ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేస్తున్న వివిధ దేశాల ప్రతినిధులకు, ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ బుధవారం సాయంత్రమే స్వాగతం పలికారని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానితో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్​లతో పాటు పలువురు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ప్రసంగిస్తారని తెలిపాయి. ఈ నెల 19న ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు. అనంతరం ‘భారత్ ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌‌పో’ సందర్శించి, వివిధ దేశాల పెవిలియన్లను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి జరిగే దేశాధినేతల సమావేశంలో పాల్గొని ఏఐ గవర్నెన్స్, మౌలిక సదుపాయాలు,  అంతర్జాతీయ సహకారంపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల సీఈవోలతో మోదీ భేటీ అవుతారు. ఇందులో పెట్టుబడులు, పరిశోధనలు, సరఫరా గొలుసులపై కీలక చర్చలు జరగనున్నాయని పీఎంవో వర్గాలు తెలిపాయి.

కాగా, ఈ సదస్సు ఇతివృత్తం ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’.. అందరి సంక్షేమం మరియు అందరి సంతోషమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. మానవాళి అభివృద్ధికి, సమగ్ర వృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చనే దానిపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం.

ఈ సదస్సు ప్రధానంగా ప్రజలు, భూమి, ప్రగతి అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. దీని కోసం ఏడు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ సదస్సులో 20కి పైగా దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, 500 మందికి పైగా గ్లోబల్ ఏఐలీడర్లు పాల్గొంటున్నారు. వీరిలో 100 మందికి పైగా సీఈవోలు, 150 మంది విద్యావేత్తలు, పరిశోధకులు కూడా ఉన్నారు.