ఇంపీచ్ మెంట్ నుంచి ట్రంప్ గట్టెక్కిండు

ఇంపీచ్ మెంట్ నుంచి ట్రంప్ గట్టెక్కిండు

సెనేట్​ కాపాడింది    
ట్రంప్​కు వ్యతిరేకంగా ఏడుగురు రిపబ్లికన్ సెనేటర్ల ఓటు
మెజార్టీకి 10 ఓట్లు తక్కువ కావడంతో గట్టెక్కిన ట్రంప్

అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా ఇంపీచ్ మెంట్ గండం నుంచి గట్టెక్కారు. శనివారం ఇంపీచ్​మెంట్ పై సెనేట్ లో జరిగిన ఓటింగ్ లో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. జనవరి 6న క్యాపిటల్ బిల్డింగ్ పై దాడికి తన మద్దతుదారులను రెచ్చగొట్టారంటూ ట్రంప్ ను ప్రతినిధుల సభ ఇంపీచ్ చేసింది. వంద మంది సభ్యులున్న సెనేట్​లో ట్రంప్​ను ఇంపీచ్​చేయడానికి మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం కాగా ఆ మేరకు ఓట్లు రాలేదు.

వాషింగ్టన్: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా ఇంపీచ్ మెంట్ (అభిశంసన) గండం నుంచి గట్టెక్కారు. సెనేట్​లో శనివారం ఇంపీచ్​మెంట్​పై జరిగిన ఓటింగ్​లో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. జనవరి 6న క్యాపిటల్ బిల్డింగ్​పై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టారంటూ ఆయనను ప్రతినిధుల సభ ఇంపీచ్ చేసింది. సెనేట్​లోనూ ఆయనను దోషిగా నిలబెట్టేందుకు ఇంపీచ్​మెంట్ ట్రయల్​కు సిఫారసులు చేసింది. దీంతో సెనేట్​లో ట్రంప్​పై నాలుగు రోజుల పాటు విచారణ జరిగింది. శనివారం ఓటింగ్ జరగగా.. ట్రంప్​ను ఇంపీచ్ చేసేందుకు అనుకూలంగా 57 వోట్లు, వ్యతిరేకంగా 43 వోట్లు వచ్చాయి. సెనేట్​లో ​ఇంపీచ్ మెంట్ కోసం రెండింట మూడొంతుల మెజార్టీ(67) రాలేదు. సెనేట్ లో వంద మంది సభ్యులు ఉండగా, డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు చెరో 50 సీట్లు ఉన్నాయి. ట్రంప్​కు వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ(రిపబ్లికన్)కి చెందిన ఏడుగురు మాత్రమే మద్దతు ఇచ్చారు. మెజార్టీకి మరో10 వోట్లు తక్కువ కావడంతో ట్రంప్ నిర్దోషిగా
బయటపడ్డారు.

ఉద్యమం ఇప్పుడే షురువైంది

అమెరికాను మళ్లీ గొప్ప స్థానంలో నిలబెట్టడం కోసం మన చరిత్రాత్మక, పాట్రియాట్రిక్, బ్యూటిఫుల్ ఉద్యమం ఇప్పుడే షురువైంది. వచ్చే రోజుల్లో నేను మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అమెరికాకు అద్భుతమైన, లిమిట్స్ లేని ఫ్యూచర్ కోసం ఒక విజన్ ను రూపొందించుకుందాం. మన ప్రజలందరికీ గొప్ప భవిష్యత్తు కోసం కలిసి ముందుకు నడుద్దాం.                               – డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ ప్రెసిడెంట్

డెమోక్రసీ సున్నితమైనది.. దానిని మనమే కాపాడాలె

మన హిస్టరీలో శాడ్ చాప్టర్ ఇది. డెమోక్రసీ చాలా సున్నితమైనదని ఈ రోజు మనకు గుర్తు చేసింది. అందుకే మనం ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండాలి. డెమోక్రసీని మనమే కాపాడుకోవాలి. హింస, తీవ్రవాదానికి దేశంలో స్థానం లేదు. అమెరికన్లుగా మనలో ప్రతి ఒక్కరికీ నిజాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది. ట్రంప్ నిర్దోషిగా బయటపడి ఉండొచ్చు. కానీ ఆయనపై ఆరోపణలపై వివాదం లేదు.         – జో బైడెన్, అమెరికా ప్రెసిడెంట్