నేటి నుంచే టీజీ అమలు

నేటి నుంచే టీజీ అమలు
  •  గెజిట్​ నోటిఫికేషన్​విడుదల చేసిన ప్రభుత్వం
  • పాత వాహనాలకు పాత నంబర్లే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇక నుంచి కొత్తగా  రిజిస్ట్రేషన్​ జరిగే వాహనాలకు టీఎస్​కు బదులుగా  టీజీగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇకపై రిజిస్ట్రేషన్​ చేసే వాహనాలకు తప్పనిసరిగా టీఎస్​కు బదులుగా టీజీ అని రాయాలని గెజిట్​లో ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఆర్టీఏ అధికారులు శుక్రవారం నుంచే వాహనాల రిజిస్ట్రేషన్​లో టీజీ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల మార్పు ప్రారంభమవుతుందని ఆర్టీఏ ఉన్నతాధికారులు వెల్లడించారు. 

శుక్రవారం నుంచి రిజిస్టరయ్యే అన్ని టూ వీలర్లు, కార్లు, ఆటోలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయన్నారు. రవాణా శాఖలో ఇక నుంచి కొత్త సిరీస్​ మొదలవుతుందని తెలిపారు. హైదరాబాద్​09, మేడ్చల్​08, రంగారెడ్డి 07 ఇలా జిల్లాల వారీగా కోడ్​లు ఉంటాయని, అలాగే నంబర్లు రిజిస్ట్రేషన్​ 0001 నుంచి ప్రారంభం అవుతాయని వివరించారు. అలాగే ప్రతి జిల్లాకు ఫ్యాన్సీ నంబర్లు 9, 9999 వంటివి కూడా అందుబాటులో ఉంటాయన్నారు. 

ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వారు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్​లైన్​లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే  మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్యాన్సీ  నంబర్ల వేలం ఉంటుందని చెప్పారు. కొత్త వాహనాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని, పాత నంబర్లు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వాహనాలకు మూడు రకాల నంబర్లు ఉండబోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఎస్ ​పేరుతో రిజిస్ట్రేషన్లు కాగా, ఇక కొత్తగా టీజీ పేరుతో రిజిస్టేషన్లు జరగనున్నాయి.