మా సోదరుడిని చూపించండి: హైకోర్టులో ఇమ్రాన్ సోదరి అలీమా పిటిషన్

 మా సోదరుడిని చూపించండి: హైకోర్టులో ఇమ్రాన్ సోదరి అలీమా పిటిషన్

ఇస్లామాబాద్: తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణ పుకార్ల వేళ ఆయన సోదరి అలీమా ఖాన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జైల్లో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్‎ను కలవడానికి అనుమతి నిరాకరించడంతో అడియాలా జైలు సూపరింటెండెంట్, ఇతరులపై ఇస్లామాబాద్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్‎ను వారానికి రెండుసార్లు కలిసేందుకు మార్చి 24న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 

ప్రతి మంగళ, గురువారాల్లో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇప్పటినప్పటికీ జైలు అధికారులు వాటిని పాటించడం లేదని పేర్కొన్నారు. తన సోదరుడి శ్రేయస్సు, అతని చట్టపరమైన హక్కులు, జైల్లో అతని పట్ల అమానవీయంగా వ్యవహరించడం గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోవడంతోనే కోర్టు ధిక్కార చర్యలను కోరినట్లు ఆమె పిటిషన్‎లో స్పష్టం చేశారు. వెంటనే తన సోదరుడిని కలిసేందుకు అనుమతించేలా అడియాలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.   

అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కొన్ని వారాల నుంచి బయటికి కనిపించడం లేదు. భద్రతా కారణాలు చెబుతూ జైలు అధికారులు అతని కుటుంబీకులను కూడా కలవనివ్వడం లేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్‎ను జైల్లో చంపేశారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు అలీమా ఖాన్, నోరీన్ నియాజీ, డాక్టర్ ఉజ్మా ఖాన్‎తో పాటు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతుదారులు అతన్ని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించారు. 

కానీ జైలు అధికారులు ఒక నెలకు పైగా అనుమతిని నిరాకరిస్తూ వస్తున్నారు. చివరకు ఖైబర్-పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది కూడా జైల్లో ఇమ్రాన్‎ను కలవడానికి ప్రయత్నించినా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు పెరిగిపోయి పీటీఐ కార్యకర్తలు రోడ్డు ఎక్కడంతో పాక్‎లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదంటూ అతడి మరణ పుకార్లను అడియాలా జైలు అధికారులు తీవ్రంగా ఖండించారు. అతడు ఆరోగ్యం ఉన్నారని వివరణ ఇచ్చారు. 

2025, డిసెంబర్ 2వ తేదీన కుటుంబ సభ్యులను ఇమ్రాన్ కలిసేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. అయినప్పటికీ ఇమ్రాన్ మరణ పుకార్లు పాకిస్తాన్‎ను కుదిపేస్తున్నాయి. తమ నాయకుడిని చూపించాలని డిమాండ్ చేస్తూ పీటీఐ మద్దతుదారులు అడియాలా జైలు దగ్గరకు భారీగా చేరుకుంటుండటంతో జైలు పరిసరాలు హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు వెలుపల దాదాపు 700 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.