
- నన్ను వెంటనే బయటకు తీసుకెళ్లండి: ఇమ్రాన్ ఖాన్
- లాయర్‌తో పాక్ మాజీ పీఎంసీ క్లాస్ సౌకర్యాలు కల్పిస్తున్నారని విమర్శ
ఇస్లామాబాద్ : అట్టోక్ జైలు నుంచి తనను వెంటనే బయటకు తీసుకెళ్లాలని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన లాయర్ కు చెప్పారు. అట్టోక్ జైల్లో ఈగలు, దోమలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జైల్లో ఇక ఏమాత్రం ఉండలేనని పేర్కొన్నారు. తనను బయటకు తీసుకెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) కూడా తన లీగల్ టీంకు ఈ మేరకు సూచించింది. ఇమ్రాన్ ను కలిసేందుకు ఆయన లాయర్ నయీం హైదర్ పంజోథాను జైలు అధికారులు సోమవారం అనుమతించారు. అనంతరం ఇమ్రాన్ ను కలిసి పంజోథా మాట్లాడారు. జైల్లో సౌకర్యాలు ఏమాత్రం బాగా లేవని, తనకు సీ క్లాస్ సౌకర్యాలు కల్పిస్తున్నారని పంజోథాతో ఇమ్రాన్ వాపోయారు. తర్వాత మీడియాతో పంజోథా మాట్లాడారు. జైల్లో సౌకర్యాలు సరిగా లేకపోయినా ఇమ్రాన్ నైతిక స్థైర్యం చెక్కుచెదరలేదన్నారు. జైల్లో గడపడానికి తనకు అభ్యంతరం లేదని, కానీ బానిసత్వానికి తలొగ్గబోనని ఆయన ప్రతిజ్ఞ చేశారని పంజోథా తెలిపారు.
జైలు స్టాఫ్‌కు సెక్యూరిటీ ఆడిట్
అట్టోక్ జైలు సిబ్బందికి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని జైలు అధికారులు నిర్ణయించారు. ఓ జైలు అధికారి, ఇమ్రాన్ ఖాన్ కోడ్ భాషలో మాట్లాడుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు జియో న్యూస్ ఓ కథనాన్ని వెలువరించింది. ఇమ్రాన్ తో ఆ జైలు అధికారి మాట్లాడిన కోడ్ భాషను రికార్డు చేశారని, కానీ ఆ ల్యాంగ్వేజ్ జైలు అధికారులకు అర్థం కాలేదని జియో న్యూస్ పేర్కొంది. దీంతో జైల్లో ఉన్న మొత్తం 150 మంది సిబ్బంది బయోడేటాను అధికారులు స్పెషల్ బ్రాంచ్ కు పంపనున్నారు. అలాగే జైల్లో సిబ్బంది వాట్సాప్ వాడకుండా నిషేధం విధించారు. కాగా, తోషాఖానా కేసుతో పాటు వివిధ కేసుల్లో దోషిగా తేలడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అట్టోక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తోషాఖానా కేసులో ఆయనకు మూడేండ్ల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే.