ఇమ్రాన్ మరణ పుకార్లు తాలిబన్ల కుట్ర.. ఆయనకు ఏం కాలేదు: పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి

ఇమ్రాన్ మరణ పుకార్లు తాలిబన్ల కుట్ర.. ఆయనకు ఏం కాలేదు: పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మరణ పుకార్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన సహచరుడు ఫవాద్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ నేషనల్ మీడియా ఛానెల్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫవాద్ చౌదరి మాట్లాడుతూ.. ఇమ్రాన్ మరణ పుకార్లు తాలిబన్ల కుట్ర అని పేర్కొన్నారు. 

ఈ సంవత్సరం ప్రారంభంలో ఆఫ్ఘన్ తాలిబాన్ చీఫ్ ముల్లా హైబతుల్లా హత్యకు గురయ్యారని పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రచురించింది. దీనికి కౌంటర్‎గా ఇమ్రాన్‎ను జైల్లో చంపేశారంటూ ఇప్పుడు ఆప్ఘాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ మరణంపై ఊహాగానాలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తప్పుడు సమాచార ఎదురుకాల్పుల్లో భాగమని స్పష్టం చేశారు. 

షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్‌కు భయపడుతోందని అన్నారు. జైల్లో ఆయన ధైర్యంగా ఉన్నారని.. జైలు అధికారులు కూడా ఇమ్రాన్ మరణ పుకార్లను ఖండించారని గుర్తు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్‎కు భయపడుతోంది కాబట్టే ఆయన ఫోటోలు విడుదల చేయడం లేదని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‎లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఇమ్రాన్ ఖాన్ గత ఎన్నికలలో సాధించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కొన్ని వారాల నుంచి బయటికి కనిపించడం లేదు. భద్రతా కారణాలు చెబుతూ జైలు అధికారులు అతని కుటుంబీకులను కూడా కలవనివ్వడం లేదు. దీంతో 
ఈ వారం ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ సహా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ హత్యకు గురయ్యారని పేర్కొన్నాయి.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ ఒక ఫొటోను కూడా విడుదల చేశాయి. దీంతో ఇమ్రాన్ మరణ వార్త పుకార్లు పాకిస్తాన్‎లో వేగంగా వ్యాపించి పీటీఐ కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ను చూపించాలని అడియాలా జైలు ముందు ఆందోళనకు దిగారు.