తోషాఖానా కేసు మళ్లీ విచారించాలె.. పాక్ సుప్రీంకోర్టులో పీటీఐ పిటిషన్

తోషాఖానా కేసు మళ్లీ విచారించాలె.. పాక్ సుప్రీంకోర్టులో పీటీఐ పిటిషన్


ఇస్లామాబాద్: విదేశీ పర్యటనల్లో వచ్చిన అధికారిక గిఫ్ట్ లను అమ్ముకున్నారన్న (తోషాఖానా) కేసులో జైలు పాలైన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌ను బయటకు తెచ్చేందుకు ఆయన సొంత పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) న్యాయపోరాటం ప్రారంభించింది. ఇమ్రాన్ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని, ఆయన కేసును మళ్లీ విచారణ చేపట్టాలంటూ ఆ పార్టీ తరఫున సీనియర్ లాయర్లు సోమవారం పాక్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ను దోషిగా తేల్చిన ఇస్లామాబాద్ లోని సెషన్స్ కోర్టు ఆయనకు మూడేండ్ల జైలు శిక్ష విధించడంతో శనివారం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇమ్రాన్ ను పంజాబ్ ప్రావిన్స్ లోని అటాక్ జైలులో ఉంచారు. అయితే, ఆ జైలులో తగిన భద్రత లేదని, ఆయనను రావల్పిండిలోని  అడియాలా జైలుకు తరలించాలంటూ ఆయన తరఫు లాయర్లు సోమవారం లాహోర్ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఇమ్రాన్ ను ఫ్యామిలీ మెంబర్స్, లాయర్స్, పర్సనల్ డాక్టర్ తరచూ కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.