చిన్నారులకు భరోసానిచ్చే బాలమిత్ర

చిన్నారులకు భరోసానిచ్చే బాలమిత్ర

బాలమిత్ర పిల్లలపై లైంగిక దాడులను అరికట్టేందుకు మూడేండ్ల కిందట మొదలైన ప్రోగ్రామ్

హైదరాబాద్, వెలుగు: చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు 2019లో సైబరాబాద్ షీ టీమ్స్ ‘బాలమిత్ర’ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. అయితే కరోనా కారణంగా దీనిపై పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేకపోయారు. ప్రస్తుతం కరోనా తీవ్రత లేకపోవడంతో  తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో స్కూల్‌‌‌‌లో ఒక టీచర్‌‌‌‌‌‌‌‌ను బాలమిత్రగా ఎంపిక చేసి వారితో స్కూల్ ప్రాంగణంలో  ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ లాంటి అంశాలపై స్కిట్‌‌‌‌ల రూపంలో అవగాహన కార్యక్రమాలు చేపడతున్నారు.

భయం లేకుండా స్వేచ్ఛగా చెప్పేలా..

మైనర్లకు పోక్సో చట్టం మీద అవగాహన కల్పించేలా 2019 ఫిబ్రవరి 15న అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ బాలమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడు దాదాపు 1600 మంది టీచర్లను బాలమిత్రలుగా నమోదు చేశారు. స్టూడెంట్లు ఎవరైనా లైంగికదాడికి గురవుతున్నారా అని తెలుసుకోవడం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటివి ఎలా ఉంటాయో వివరించి, ఆ సమయంలో ఎలా స్పందించాలో తెలిపారు. అలాంటి సంఘటన ఎదురైనప్పుడు దానికి సంబంధించి ఎవరికి కంప్లయింట్ చేయాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. రెండేళ్ల పాటు కరోనా ఎఫెక్ట్ తో  అంతంత మాత్రంగానే నడుస్తున్న ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. రెండ్రోజుల కిందట గచ్చిబౌలిలోని శాంతిసరోవర్‌‌‌‌‌‌‌‌లోని బ్రహ్మకుమారిస్ ఆడిటోరియంలో ఇతర ఉన్నతాధికారులతో కలిసి  బాలమిత్ర లోగో ని లాంచ్ చేసి బ్రోచర్లను  రిలీజ్ చేశారు.

స్కూళ్లు, కాలేజీల్లో..

ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతో పాటు  జూనియర్ కాలేజీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటివరకు బాలమిత్ర  టీచర్ల ద్వారా 58 అర్జీలు అందగా వాటిలో పోక్సో కేసులు, పలు పెటీ కేసులున్నాయి. వాటిని నమోదు చేయడంతో పాటు సీడబ్ల్యూసీ సహకారంతో షీ టీమ్స్ అధికారులు 7 బాల్య వివాహాలను నిలిపివేసి వారికి కౌన్సె
లింగ్ ఇచ్చారు. ప్రస్తుతం చేపట్టబోయే ఈ కార్యక్రమంలో చిన్నారులకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు పిల్లల పట్ల తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు ఎలా ప్రవర్తించాలనే తీరుపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. చాలామంది చిన్నారులు తమ తల్లిదండ్రులకు సమస్యను చెప్పేందుకు భయపడుతుంటారు. బాలమిత్రలో భాగంగా తమ సమస్యను తల్లిదండ్రులు, టీచర్లతో స్వేచ్ఛగా చెప్పుకునేవిధంగా భరోసా కల్పిస్తారు. దీంతో పాటు స్మార్ట్ ఫోన్ వాడకం, ఇంటర్నెట్ వల్ల  జరిగే మంచీచెడులను వివరిస్తారు. ప్రతి స్కూల్​లో ఒక కౌన్సెలర్​ని ఎంపిక చేసి షీ టీమ్స్, స్టూడెంట్లకు మధ్య వారధిలా ఉంచుతారు.

ఫ్రెండ్ .. ఫిలాసఫర్.. గైడ్

పిల్లలకు బాలమిత్ర ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్​గా పని చేయనుందని విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత తెలిపారు.  బాలమిత్రలు గుడ్ టచ్​, బ్యాడ్ టచ్ గురించి చెప్పడం, జెండర్ సెన్సిటైజేషన్, మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించడం, పిల్లల పట్ల జరిగే లైంగిక వేధింపులపై అవగాహన కల్పిస్తారన్నారు. విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల గౌరవాన్ని పెంచడం కూడా ఈ కార్యక్రమ ఉద్దేశమని ఆమె చెప్పారు. వేధింపులకు గురిచేస్తున్నవారి గురించి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుల వివరాలను సీక్రెట్​గా ఉంచనున్నట్లు తెలిపారు. బాలమిత్ర ఫేస్ బుక్ పేజ్ కోసం balamithra.cyberabad పేజ్​ను ఫాలో కావొచ్చని.. అలాగే balamithra.cyberabad@gmail.com ఈ మెయిల్ ద్వారా 9490617444  వాట్సాప్​కు  కంప్లయింట్ చేయొచ్చన్నారు. బాలమి త్రలు పిల్లల సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని డీసీపీ కవిత తెలిపారు. అలాగే స్కూళ్లలోని సమస్యలను తెలిపితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామ న్నారు. లైంగిక హింసకు గురవుతున్న వారిలో బాలికలతో పాటు, బాలురు కూడా ఉంటున్నారని.. అలాంటి అకృత్యాలను అరికట్టేందుకు, బాధితులు తమ బాధలను చెప్పుకోవడానికి ఏర్పాటు చేస్తున్న వేదికే బాలమిత్ర అని ఆమె తెలిపారు. 

మైనర్లపై లైంగిక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి

చిన్నారులు, స్టూడెంట్లపై జరుగుతున్న లైంగిక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.  ఇలాంటి ఘటనలు బయటకు చెబితే కుటుంబ పరువు పోతుందని ఇంటి పెద్దలు అనుకోవడం వల్ల చాలామంది పోలీసులకు కంప్లయింట్ చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇది సరికాదు. బాధితులు ధైర్యంగా ముందుకు వస్తే వారి వివరాలు సీక్రెట్ గా ఉంచడంతో పాటు చట్టప్రకారం వారికి న్యాయం చేస్తాం. స్కూళ్లు, కాలేజీల  మేనేజ్ మెంట్లు  సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలి. అనుమానితుల కదలికలపై పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలి. - స్టీఫెన్ రవీంద్ర,సీపీ,సైబరాబాద్