
దీపావళి పండుగ సందర్భంగా అందరూ తినే ఐటమ్ ఏదైనా ఉందంటే అది స్వీటే. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా తినే స్వీట్లను పండుగ సందర్భంగా బల్క్ గా.. టన్నుల కొద్ది తయారు చేస్తుంటారు. పండుగను పురస్కరించుకుని నిబంధనలలు పాటించకుండా స్వీట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు.. బుధవారం (అక్టోబర్ 15) హైదరాబాద్ లో రైడ్స్ నిర్వహించారు.
హైదరాబాద్ లో 43 స్వీట్ షాప్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. తియ్యని స్వీట్ల తయారీ గురించి చేదు నిజాలు బయటపెట్టారు అధికారులు. మిఠాయి తయారీలో ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. అదే విధంగా ఎలాంటి లేబుల్, ఎక్స్ పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
స్వీట్ తయారు చేసే ప్లేస్ లో ఈగలు, దోమలు ఉన్నట్లు గుర్తించారు. కిచెన్ లో పని చేసే వారు హెడ్ క్యాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోవట్లేదని తెలిపారు. స్వీట్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని తెలిపారు. చాలా షాపులలో, త యారీ కేంద్రాల కిచెన్ లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కిచెన్ లో ఓవెన్ మురికిగా ఉండటం చూసి ఆగ్రహానికి గురయ్యారు.
దీపావళి గిరాకీ ఎక్కువగా వస్తుందని టన్నుల కొద్దీ స్వీట్స్ తయారు చేస్తుండటంతో.. పరిశుభ్రత పాటించక పోవడంతో ప్రజలకు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశముందని తెలిపారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. నిబంధనలు పాటించని స్వీట్ షాపులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ రైడ్స్ దీపావళి పూర్తయ్యే వరకు కొనసాగుతాయని తెలిపారు.