Be alert : మసాలాలు, మిరియాల్లో ఎలుకల మలం.. ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీల్లో గుర్తింపు ..

Be alert : మసాలాలు, మిరియాల్లో ఎలుకల మలం.. ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీల్లో గుర్తింపు ..
  • బిర్యానీ ఆకులూ కలుషితమే..
  • రాష్ట్రంలోని 30కి పైగా తయారీ కేంద్రాలు..
  •  ప్యాకింగ్ సెంటర్లపై  ఫుడ్​ సేఫ్టీ దాడులు..
  • ఎక్స్​పైరీ డేట్, లేబుల్ లేని  ఉత్పత్తులు సీజ్  
  •  రంగారెడ్డి జిల్లాలో రెండు చోట్ల గుర్తింపు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ శివారులోని 30కిపైగా మసాలా తయారీ కేంద్రాలు, ప్యాకింగ్ సెంటర్లపై మంగళవారం స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు ​నిర్వహించారు. ఈ దాడుల్లో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. రెండు తయారీ కేంద్రాల్లో నల్ల మిరియాలు, బిర్యానీ ఆకులు ఎలుకల మలంతో కలుషితమైనా, అలాగే షాపులకు పంపుతున్నట్టుగా గుర్తించారు. 

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్, బండ్లగూడ జాగీర్​మున్సిపల్ కార్పొరేషన్ కపిలనగర్ కాలనీలోని డివైన్ స్పైసెస్ లో కనీస ప్రమాణాలు పాటించకుండా స్పైసెస్ తయారు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కారం పొడి, పసుపు, మిరియాలు, కరివేపాకు పొడి, ధనియాల పౌడర్ శాంపిల్స్​సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించారు. 

ఇక్కడ మిరియాలు, ఇతర మసాలాల్లో ఎలుకల మలం కూడా కలిసినట్టు గుర్తించారు. ఆ మసాలాలను అలాగే ప్యాక్​చేసి షాపులకు పంపుతున్నట్టు తెలిసింది. ఈ రెండు కేంద్రాల నుంచి ఎలుకల మలంతో కలుషితమైన15 కిలోల నల్ల మిరియాలు, 18 కిలోల బిర్యానీ ఆకులు, లేబుల్ లేకుండా ఉన్న కరివేపాకు పొడిని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకొని ల్యాబ్ కు పంపారు. అలాగే గడువు ముగిసిన ఉత్పత్తులతో పాటు కొన్ని వస్తువులకు లేబుల్స్ లేకుండా స్టోర్ చేసినట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని మసాలా తయారీ కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు.   

ఇలా ఫిర్యాదు చేయొచ్చు.. 

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఫుడ్ క్వాలిటీపై ఫిర్యాదులు ఉంటే.. diripmtg@gmail.comలేదా fssmutg@gmail.com కు మెయిల్​ద్వారా కంప్లయింట్ ఇవ్వొచ్చని లేదంటే 9100105795 నెంబర్ కు కాల్ చేయవచ్చు అని అధికారులు తెలిపారు. అలాగే ‘ఎక్స్’ ద్వారా అయితే @cfs_telanganaకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. హెచ్ఎంసీ పరిధిలో అయితే 040–21111111 లేదా foodsafetywing.ghmc@ gmail.com కు లేదా ట్విట్టర్ అయితే @afcghmc @fooddatfetyghmc కి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.