హిందీ సినిమాలను.. తమిళనాడులో బ్యాన్ చేయాలని.. స్టాలిన్ సర్కార్ నిర్ణయం !

హిందీ సినిమాలను.. తమిళనాడులో బ్యాన్ చేయాలని.. స్టాలిన్ సర్కార్ నిర్ణయం !

చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా హిందీ భాషను రుద్దాలని చూస్తోందంటూ మొదటి నుంచి గళం వినిపిస్తున్న తమిళనాడు తాజాగా కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. తమిళనాడులో హిందీ భాష సినిమాలు, పాటలు, బోర్డులు, హోర్డింగ్స్పై నిషేధం విధించాలని తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లును తమిళనాడు అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిషేధం అమలు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే న్యాయ నిపుణులతో తమిళనాడు ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపింది.

అయితే.. తమిళనాడులో హిందీపై నిషేధం అమలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం రాజ్యాంగానికి లోబడి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. స్టాలిన్ సర్కార్ తీసుకున్న హిందీ నిషేధం నిర్ణయంపై తమిళనాడు బీజేపీ మండిపడింది. ఇది ఒక తెలివితక్కువ నిర్ణయం అని తమిళనాడు బీజేపీ విమర్శించింది. భాషను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం డీఎంకే వాడుకుంటుందని బీజేపీ ఆరోపించింది.

దేశంలో హిందీ భాషకు వ్యతిరేకంగా మొట్టమొదట గళం వినిపించిన రాష్ట్రం తమిళనాడు. ఇక్కడి ప్రజలు, నాయకులు స్వాతంత్ర్యానికి ముందు నుంచే అంటే..1930ల నుంచే హిందీని వ్యతిరేకిస్తున్నారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక తెచ్చిన త్రిభాషా విధానాన్ని సైతం తిరస్కరించారు. తమిళనాడులో హిందీ బోధన ప్రారంభిస్తే తమిళుల గుర్తింపే ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. హిందీని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫెడరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తమిళనాడు(ఎఫ్ఎస్ఓటీఎన్), డీఎంకే ఆధ్వర్యంలో మదురై, దిండిగల్, థేని, రామనాథపురం, శివగంగ తదితర ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు.

మేలూరు పోస్ట్ ఆఫీస్, ఇతర ప్రాంతాల్లోని ఆఫీసులకు హిందీలో ఉన్న నేమ్ బోర్డులపై నలుపు రంగు పూశారు. గత మార్చిలో సీఎం ఎంకే స్టాలిన్ సైతం కేంద్రంపై మండిపడ్డారు. హిందీని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామన్నారు. ఏప్రిల్ లోనూ హిందీ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తడంతో స్టాలిన్ స్పందిస్తూ.. హిందీ భాష హర్యాన్వీ, రాజస్థానీ, బిహారీ వంటి భాషలను మింగేస్తోందన్నారు. హిందీ వివాదం ఒక తేనెతుట్టెలాంటిదని, దీనిని కదిలించొద్దంటూ కేంద్రాన్ని హెచ్చరించారు.