
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన రౌడీ షీటర్ కొడుదుల నవీన్ రెడ్డి (32)కి రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు నగర బహిష్కరణ నోటీసు జారీ చేశారు. ఆరు నెలల పాటు కమిషనరేట్ పరిధి నుంచి అతనిని ఎందుకు బహిష్కరించకూడదో ఏడు రోజుల్లోగా కారణం చూపించాలని ఆదేశించారు.
నవీన్ రెడ్డి మిస్టర్ టీ, మిస్టర్ ఇరానీ టీ ఫ్రాంచైజ్ ఓనర్. అయితే.. ఇతనిపై దాడి, హత్యాయత్నం, బెదిరింపులు, అల్లర్ల కేసులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. రౌడీ షీటర్గా చలామణీ అవుతూ కొందరిని ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి మళ్లీ బెదిరిస్తుండటంతో అతనిపై ఫిర్యాదు చేసే సాహసం బాధితులు చేయడం లేదని పోలీసులు తెలిపారు. అతని ప్రవర్తన.. శాంతిభద్రతలకు హానికరం అని, అతనిని నగర పరిమితుల నుంచి బహిష్కరించినట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
డిసెంబర్ 2022లో తుర్కయాంజల్‌లోని ఆమె ఇంటి నుంచి ఒక మహిళా డాక్టర్ను సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి నవీన్ వార్తల్లో నిలిచాడు. పట్టపగలు నవీన్ రెడ్డి ఈ కిడ్నాప్ చేయడం గమనార్హం. ఈ కిడ్నాప్ చేసిన సమయంలో నవీన్ రెడ్డి వయసు 26 ఏళ్లు. దాదాపు 40 మంది గూండాలను వెంటేసుకుని ఆ మహిళ ఇంట్లోకి నవీన్ రెడ్డి చొరబడ్డాడు. ఆమె కుటుంబం సదరు లేడీ డాక్టర్కు నిశ్చితార్థం ఫిక్స్ చేసింది. ఆ సమయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవీన్ ఆ మహిళా డాక్టర్ను మొదట బ్యాడ్మింటన్ అకాడమీలో కలిశాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
ప్రేమను నిరాకరించడంతో ఆమెపై ద్వేషం పెంచుకున్న నవీన్ రెడ్డి ఆమె నిశ్చితార్థాన్ని చెడగొట్టేందుకు యత్నించాడు. ఆమె ఇంట్లోకి చొరబడి, ఫర్నిచర్ ధ్వంసం చేసి.. ఆమెను కిడ్నాప్ చేశాడు. అయితే ఆమె తండ్రి దామోదర్ రెడ్డి వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆయనపై కూడా దాడి చేశాడు. ఈ కిడ్నాప్తో బాధిత కుటుంబం ఆగ్రహంతో రగిలిపోయింది. ఆమె ఇంటికి ఎదురుగా ఉన్న మిస్టర్ టీ అవుట్‌లెట్‌ను బాధిత కుటుంబం కూల్చేసింది.