- సభ్యులుగా 15 గ్లోబల్ కంపెనీలు
- ఇండియా నుంచి జియో లిస్టులో ఆంత్రోపిక్, మైక్రోసాఫ్ట్
న్యూఢిల్లీ:జియో ప్లాట్‌ఫార్మ్స్, ఆంత్రోపిక్, ఎరిక్సన్ సహా మరో 12 గ్లోబల్ కంపెనీలు కలిసి ట్రస్టెడ్ టెక్ అలయన్స్ (టీటీఏ)ను ప్రారంభించాయి. స్విట్లర్లాండ్ నగరం మ్యూనిక్‌లో జరిగిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఈ కూటమిని ప్రకటించాయి. ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా ఖండాల నుంచి 15 కంపెనీలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. కనెక్టివిటీ నుంచి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్లు, సాఫ్ట్‌వేర్, ఏఐ వంటి రంగాల్లో నమ్మకమైన టెక్నాలజీను అందించడం ఈ కూటమి ప్రధాన ఉద్దేశం.
ఆంత్రోపిక్, ఏడబ్ల్యూఎస్, కసావా టెక్నాలజీస్, కోహియర్, ఎరిక్సన్, గూగుల్ క్లౌడ్, హన్వా, జియో ప్లాట్‌ఫార్మ్స్, మైక్రోసాఫ్ట్, నోకియా, ఎన్‌స్కేల్, ఎన్‌టీటీ, రాపిడస్, సాబ్, ఎస్ఏపీ ఇందులో సభ్యులు. కార్పొరేట్ గవర్నెన్స్, నైతిక ప్రవర్తన, కార్యాచరణ , పారదర్శకత, సురక్షిత అభివృద్ధి, స్వతంత్ర అంచనా వంటి సూత్రాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. పటిష్ట సరఫరా గొలుసు, భద్రతా పర్యవేక్షణ, సమగ్ర డిజిటల్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడంపై ఈ కూటమి దృష్టి పెడుతుంది. చట్టాలను గౌరవిస్తూ డేటా రక్షణకు పెద్దపీట వేస్తుంది.
సేవలు సేఫ్..
ఇంటర్నెట్, ఏఐ, సెమీకండక్టర్లు, క్లౌడ్ సేవలు సురక్షితంగా ఉండేలా చూడాలని ఈ కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా మారుతోంది. దీనివల్ల ప్రజలకు డేటా భద్రతపై కొన్ని అనుమానాలు వస్తున్నాయి. వీటిని తొలగించి నమ్మకమైన సేవలు అందించడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యం. పారదర్శకత, నైతిక విలువలు, డేటా రక్షణ వంటి అంశాలకు ఇవి కట్టుబడి ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, కొత్త ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఇది తోడ్పడుతుంది. ఏ దేశ కంపెనీ అయినా, ఒకే రకమైన భద్రతా నియమాలు పాటించాలని ఈ కూటమి నిర్ణయించింది. దీనివల్ల వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన సేవలు అందుతాయి. టెక్నాలజీ రంగంలో నమ్మకాన్ని పెంచడం కోసం ఈ కంపెనీలు కలిసి పనిచేస్తాయి.
