వెలుగు ఓపెన్ పేజీ.. దేశాభివృద్ధిలో మావోయిస్టులూ భాగస్వామ్యం కావాలి

వెలుగు ఓపెన్ పేజీ.. దేశాభివృద్ధిలో మావోయిస్టులూ భాగస్వామ్యం కావాలి

సాయుధ పోరుకు స్వస్తి పలికి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు స్వాగతం. ఆధునిక ప్రపంచంలో సాయుధ పోరాటాలకు చోటు లేకుండా పోతున్న కాలమిది. ఆయా దేశాల్లోని సమకాలీన రాజకీయ స్థితిగతులే  ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆలస్యంగానైనా భారత మావోయిస్టులు తమ పంథా మార్చుకుని  సాయుధ పోరుకు స్వస్తి పలికి సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు రావటం వారి వారి కుటుంబాలకు, దేశానికి శుభపరిణామం. 

ఆలస్యంగానైనా  హింసను  విడనాడి,  వాస్తవిక  ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం,  ప్రజాస్వామ్య పంథాను  స్వీకరించట సరైన నిర్ణయం.  పీపుల్స్ వార్,  మావోయిజం పేరుతో  50 ఏళ్లుగా యువత అడవుల బాట  పట్టింది.  పోలీసులు, ఉద్యమకారులు వేలాదిమంది ఈ సంఘర్షణలో ప్రాణాలు కోల్పోయారు.  వేలాది కుటుంబాలు కుటుంబ పెద్దను  కోల్పోయి రోడ్డున పడ్డాయి.    సిద్ధాంత వైరుధ్యాలున్నప్పటికీ మావోయిస్టుల మేధస్సు ఈ దేశ నిర్మాణానికి అవసరం.

భారతీయ మూలాలను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా వారి మేధస్సును నవభారత్​ నిర్మాణానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది.  అభివృద్ధి కావాలంటే తుపాకీలు కాదు.. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, మార్కెట్లు, ఇన్నోవేషన్ సెంటర్లు కావాలి.   దేశంలో సుస్థిర రాజకీయ నాయకత్వం ఈ అంశాలన్నింటిపైనా పట్టు సాధించటమే కాదు. అంతర్గత సమస్యల పరిష్కారం దిశగా ప్రస్తుతం ఓ గొప్ప మైలురాయిని అధిగమించే సమయం వచ్చేసింది. దేశం ఐక్యంగా ప్రపంచ సవాళ్లను ఎదుర్కోనేందుకు మార్గం సుగమమైనట్లు చెప్పుకోవచ్చు.

బలమైన దేశం దిశగా..

నేడు భారత్ ప్రపంచంలోని వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక శక్తులలో ఒకటే కాదు, జీడీపీ పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతున్న మహాశక్తి.  ప్రపంచ రాజకీయాలు, వాణిజ్యం, సంరక్షణ రంగాల్లో భారతదేశం ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది.  ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సమస్యకూ కమ్యూనిజం పరిష్కారం చూపడం సాధ్యంకాదు.  కాబట్టి దేశాన్ని మళ్లీ సంఘర్షణల దారికి తీసుకువెళ్లే సిద్ధాంతాలకు మనం తావివ్వలేం. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు దేశంలోని ప్రతి వర్గం ముందుకు వచ్చేందుకు ఇదే సరైన సందర్భం. 

ఏ సిద్ధాతమైనా కాలంతోపాటు మారాలె

ఏ సిద్దాంతమైన కాలంతో పాటు మారాలి. సమకాలీన పరిస్థితులను అవలోకనం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా మనం తీసుకునే నిర్ణయాలు సమాజానికి మేలు చేకూర్చేలా ఉండాలి. వందేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవు. కూడు, గూడు, గుడ్డ నినాదాలు ప్రస్తుతం జనబాహుళ్యంలో తగ్గాయి.  ప్రజల  జీవితాల్లో మార్పులు వచ్చాయి. మెజార్టీ ప్రజలు సంతృప్త జీవితాన్ని గడుపుతున్నారు. ఇంకా కొంత వెనకబాటు అక్కడక్కడా ఉన్నా.. వారి భద్రత, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. 

దేశంలోని పౌరులంతా గౌరవంగా, గర్వంగా బతికేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంది. అడవిలో  మొదటిసారి వచ్చిన మొబైల్ నెట్‌వర్క్, గ్రామంలో రహదారి, మొదటిసారి  వచ్చిన వైద్య శిబిరం.. ఇవన్నీ గ్రామస్తుల జీవితాన్ని మార్చాయి.  గ్రామాల్లో విద్య,  వైద్యం,  నీరు, రహదారులు, ఉచిత గ్యాస్, డిజిటల్ కనెక్టివిటీ.. అన్నీ కలిసి ఒక నూతన ఆత్మవిశ్వాసాన్ని సృష్టించాయి. కాబట్టి ప్రజాస్వామ్య వికాసమే దేశాన్ని ముందుకు నడపగలదు.

-జీవన్ ఏబీవీపీ నేషనల్​ కౌన్సిల్​ మెంబర్​