
ఈరోజుల్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ వాడనివారు ఉండరు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇళ్లలో, ఆఫీసుల్లో, షాపింగ్ మాల్స్, హోటళ్లు, ఇలా ప్రతిచోటా వాష్ రూమ్స్ లో హ్యాండ్ వాష్ లిక్విడ్ తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా కరోనా తర్వాత జనాల్లో శుభ్రత పట్ల అవగాహన పెరిగింది. అప్పటిదాకా శానిటైజర్లు, హ్యాండ్ వాష్ ల గురించి తెలీనివారు కూడా వాడటం మొదలుపెట్టారు. అయితే.. హ్యాండ్ వాష్ లిక్విడ్ వాడినంత మాత్రాన మన చేతులు శుభ్రం అవుతాయా అంటే.. కాదనే అంటున్నారు నిపుణులు. హ్యాండ్ వాష్ వాడినంత మాత్రాన క్రిముల నుంచి మనల్ని మనం రక్షించుకున్నట్లు కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇప్పుడు ఈ కథంతా ఎందుకంటే.. అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కాబట్టి. ఇవాళ బి ఎ హ్యాండ్ వాషింగ్ హీరో అనే థీమ్‌తో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే జరుపుతున్నారు. ఖచ్చితంగా, అందరూ భోజనానికి ముందు లేదా టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కుంటాం... కానీ వాస్తవానికి, చేతుల పరిశుభ్రత గురించి ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి.. అవి మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. ఆ అపోహలలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హ్యాండ్ వాష్ లిక్విడ్ వాడితే చేతులు శుభ్రమైనట్లేనా.. ?
హ్యాండ్ వాష్ తో, సోప్ తో చేతులు కడుక్కోవడం మంచిదే కానీ.. అక్కడితో పని పూర్తవ్వడు అని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మనం 24 గంటలు వాడే ఫోన్ల నుంచి, కీబోర్డ్, లిఫ్ట్ బటన్స్, మెనూ కార్డ్స్, షాపింగ్ కార్ట్ హ్యాండిల్స్ వంటి తరచూ వాడే వస్తువులు చాలా కలుషితమై ఉంటాయని.. కాబట్టి ఎంత చేతులు కడుక్కున్నా కూడా క్రిముల నుంచి మనం తప్పించుకోలేమని అంటున్నారు.కాబట్టి చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
హాస్పిటల్ స్టాఫ్ కి మాత్రమే రిస్క్ ఎక్కువ...?
ఇలా అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే అని చెప్పాలి.. క్రిములకు హాస్పిటల్, ఇల్లు, ఆఫీసు అన్న తేడా ఉండదు. ఆఫీసు డెస్క్ దగ్గర ఉన్నా.. ఇంట్లో కిచెన్లో వంట చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా కూడా మనం క్రిములతో సహవాసం చేసినట్లే. ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. పరిశుభ్రత పాటించడం.. శుభ్రత అవసరాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యమని చెబుతున్నారు నిపుణలు.
ఎవరిని ముట్టుకోకపోతే ఇన్ఫెక్షన్లు రావా.. ?
ఎవరినీ ముట్టుకోకుండా ఉంటే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటామన్నది పెద్ద అపోహ. ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, కలుషితమైన ఉపరితలాలను తాకడం వల్ల ముఖం, నోరు లేదా ముక్కు ద్వారా క్రిములు వ్యాప్తి చెందుతాయి. అందుకే నిరంతరం ముఖాన్ని తాకకపోవడం ఆరోగ్యంగా ఉండటానికి సులభమైన మార్గం.