జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మాగంటి సునీత కుటుంబం వద్ద నాలుగు కిలోల బంగారం !

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మాగంటి సునీత కుటుంబం వద్ద నాలుగు కిలోల బంగారం !

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా.. తన కుటుంబ స్థిర, చరాస్తుల వివరాలపై ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. మాగంటి సునీత కుటుంబం దగ్గర 4 కిలోల బంగారం ఉందని అఫిడవిట్లో తెలిపారు. ఆమె చేతిలో నగదు 38 వేల 800 రూపాయల నగదు ఉండగా.. మూడు బ్యాంకు ఖాతాల్లో కలిసి సుమారు 32 లక్షలు, బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారు వెండి ఆభరణాలు మొత్తం కలిపి 6 కోట్ల18 లక్షల 54 వేల 274 రూపాయలు ఉన్నట్టు పేర్కొన్నారు. ముగ్గురు పిల్లల పేరిట షేర్లు, ఆభరణాల విలువ సుమారు 4 కోట్ల 62 లక్షలుగా ఆమె అఫిడవిట్లో తెలిపారు.

స్థిరాస్తుల విషయానికొస్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 34 లో ఓ ప్లాటు, గోపన్నపల్లిలో ఓ ప్లాటు ఉన్నట్లు వెల్లడించారు. వీటి మొత్తం విలువ 6 కోట్ల11 లక్షల రూపాయలు, పిల్లల పేరిట 8 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా సునీత పేరిట 4.44 కోట్ల అప్పు ఉండగా, పిల్లల పేరుపై ఆరు కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియామావళి ఉల్లంఘించినందుకు గతవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైనట్లు అఫిడవిట్లో ఆమె ఎన్నికల సంఘానికి తెలిపారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గోపీనాథ్ సతీమణి సునీత పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే  ప్రచారంలో తలమునకలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2018లో ఎంఐఎం అభ్యర్థిగా బరిలోకి దిగి భారీగా ఓట్లు పొందిన నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. అదే విధంగా 2023 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి బీజేపీ టికెట్ ఖరారు చేసింది. ఈ సారి మజ్లిస్ పోటీకి దూరంగా ఉంటోందని సమాచారం.