ఆర్జేడీ, కాంగ్రెస్‌‌కు చొరబాటుదారులపైనే ప్రేమ.. శ్రీరాముడంటే వారికి ఇష్టముండదు: ప్రధాని మోదీ

ఆర్జేడీ, కాంగ్రెస్‌‌కు  చొరబాటుదారులపైనే ప్రేమ.. శ్రీరాముడంటే వారికి ఇష్టముండదు: ప్రధాని మోదీ
  • బిహార్‌‌లో 15 ఏండ్ల ‘జంగిల్ రాజ్’లో అభివృద్ధి శూన్యం
  • నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుతోనే డెవలప్​మెంట్
  • బిహార్​లోని భాగల్‌‌పూర్, అరారియా జిల్లాల్లో  ప్రచారం

భాగల్‌‌పూర్/అరారియా: బిహార్‌‌లో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే ప్రతిపక్ష ఆర్జేడీ, -కాంగ్రెస్ కూటమికి చొరబాటుదారులపైనే ప్రేమ ఉంటుందని.. శ్రీరాముడు, ఛత్ మయ్యా అంటే వారికి ఇష్టముండదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అయోధ్యలో నిషాద్ రాజ్, మాతా షబరి, మహర్షి వాల్మీకి ఆలయాలను దర్శించుకోవడానికి ప్రతిపక్ష నేతలు ఇష్టపడకపోవడం దళితులు, వెనుకబడిన తరగతులపై వారికి ఉన్న ద్వేషాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన బిహార్​లోని భాగల్‌‌పూర్, అరారియా జిల్లాల్లో ఎన్నికల సభలో పాల్గొని మాట్లాడారు. ‘‘బిహార్‌‌లో 15 ఏండ్ల ‘జంగిల్ రాజ్’లో అభివృద్ధి శూన్యం. 

హైవేలు, బ్రిడ్జీలు నిర్మించలేదు. ఉన్నత విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. సీఎం నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు హయాంలో  బిహార్‌‌లో అనేక ఎక్స్‌‌ప్రెస్‌‌వేలు, నదులపై వంతెనలు, నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా కేంద్రాలు ఉన్నాయి. ఈ అభివృద్ధి ప్రయాణాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లేది ఎన్డీయే మాత్రమే’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ జర్నీలో చొరబాటు ముప్పు ఎన్డీయేకు పెద్ద సవాలు అని, దేశం నుంచి ప్రతి చొరబాటుదారుడిని తరిమికొట్టడానికి ఎన్డీయే కట్టుబడి ఉందన్నారు. కానీ, కాంగ్రెస్, -ఆర్జేడీ వారికి రక్షణ ఇస్తున్నాయని, వారికి అనుకూలంగా రాజకీయ యాత్రలు చేపడుతున్నాయని, తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర, ఓటు దొంగతనం ఆరోపణలను పరోక్షంగా ప్రధాని విమర్శించారు.

‘‘కాంగ్రెస్ నామ్‌‌దార్ (గాంధీ) ఛత్ మయ్యా భక్తిని డ్రామా అని పిలిచారు. శ్రీరాముడిపై వారి అయిష్టత నాకు అర్థమవుతుంది. కానీ, కనీసం నిషాద్ రాజ్, శబరి,  వాల్మీకి ఆలయాలకు నమస్కారం చేయవచ్చు కదా. ఇలా చేయడానికి ఇష్టపడకపోవడం దళితులు, వెనుకబడిన తరగతులపై వారి ద్వేషాన్ని సూచిస్తుంది’’ అని మోదీ ఆరోపించారు. కాగా, రెండు కూటమి భాగస్వాములు సామాజిక కలహాలు రెచ్చగొట్టారని, ఆర్జేడీని జాతి హింసకు, కాంగ్రెస్‌‌ను మత ఘర్షణలకు (1989 భాగల్‌‌పూర్ అల్లర్లు, 1984 సిక్కు వ్యతిరేక హింస) బాధ్యులని ప్రధాని అన్నారు.