- 3 కార్పొరేషన్ల సమన్వయంతో పనులు
- మెట్రో వాటర్ బోర్డు నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక నుంచి రోడ్ల నిర్మాణానికి ముందే వాటర్(తాగునీరు), సీవరేజ్(మురుగునీటి) పైప్‌లైన్లను ఏర్పాటు చేసేందుకు మెట్రో వాటర్ బోర్డు ప్రణాళిక రూపొందిస్తోంది. కొత్తగా రోడ్లు వేసిన తర్వాత తిరిగి తవ్వకాలు జరపడం వల్ల ప్రజాధనం వృథా కావడంతోపాటు రోడ్లు దెబ్బతింటున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాటర్ బోర్డు నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీతోపాటు కొత్తగా ఏర్పడిన సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ల పూర్తి సమన్వయంతో పనులు చేపట్టాలని ఇటీవల జరిగిన అధికారుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
సమన్వయలోపంతో రోడ్ల తవ్వకాలు
ప్రస్తుతం ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా కొత్త రోడ్లను సైతం మళ్లీ తవ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై రోడ్లు వేసే ప్రాంతాల వివరాలను ముందే సేకరించి, ఆయాచోట్ల వాటర్, సీవరేజ్నెట్వర్క్ను ముందుగానే పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సంబంధిత శాఖల మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని అకుంటున్నారు. నగరంలో ప్రస్తుతం ఉన్న వాటర్, సీవరేజ్లైన్లను మ్యాపింగ్ చేయడంతోపాటు, భవిష్యత్‌లో అవసరమయ్యే కొత్త లైన్లు, అలైన్‌మెంట్లు, వాల్వ్‌లు, మ్యాన్‌హోళ్ల నిర్మాణాలను రోడ్ల ప్రణాళిక దశలోనే గుర్తించనున్నారు.
సీవరేజ్ మాస్టర్‌ప్లాన్‌కు అనుసంధానం
సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, మురుగునీటి నిర్వహణ అవసరాలను ముందే అంచనా వేయనున్నారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చేపట్టే సీవరేజ్ పనులను నేరుగా సీవరేజ్ మాస్టర్ ప్లాన్‌కు అనుసంధానించాలని నిర్ణయించారు. దీనివల్ల నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి మరింత ప్రణాళికాబద్ధంగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు.
మురుగునీటి పరిమాణాన్ని అంచనా వేసి..
రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకిగా మారుతున్న వాటర్ సప్లై వాల్వ్‌లు, పైప్‌లైన్లు, మ్యాన్‌హోళ్లు, సీవరేజ్ నెట్‌వర్క్‌లను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖలతో కలిసి పరిశీలించి, అవసరమైన చోట వాటిని వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వాటర్‌బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో పెరిగే మురుగునీటి పరిమాణాన్ని ముందుగానే అంచనా వేసి, వాటర్ బోర్డు నెట్‌వర్క్‌పై అదనపు భారం పడకుండా అవసరమైన శుద్ధి కేంద్రాలు, కనెక్టివిటీ, నెట్‌వర్క్ విస్తరణకు ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
