చాలా చోట్ల అర్హులకు అందలే

చాలా చోట్ల అర్హులకు అందలే

భద్రాచలం, వెలుగు: ఇల్లు మునిగిన ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు పరిహారం ఇస్తామని గోదావరి వరదల సమయంలో భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్​ చేసిన ప్రకటన జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా నిజమైన బాధితులకు నేటికీ పరిహారం అందలేదనే విమర్శలున్నాయి. ఇల్లు కూలినా, పూర్తిగా మునిగినా పరిహారం ఇవ్వలేదని, కొందరికే సాయం అందించారని బాధితులు వాపోతున్నారు. బూర్గంపాడులో 7 వేల ఇళ్లు మునిగినట్లు సర్వేలో పేర్కొనగా, 5 వేల మందికే పరిహారం ఇచ్చారు. పినపాక నియోజకవర్గంలో 2 వేల మందికి, భద్రాచలం నియోజకవర్గంలో 2,038 కుటుంబాలకు పరిహారం ఖాతాల్లో పడలేదు. జిల్లా కలెక్టర్​ మాత్రం ఈ నెల 3న అందరికీ పరిహారం జమ చేశామని ప్రకటన చేశారు. ఆయన ప్రకటించిన 16,044 కుటుంబాల్లోనే పలువురికి పరిహారం రాకపోవడం గమనార్హం. రెవెన్యూ ఆఫీసర్లు మాత్రం వివిధ కారణాలతో రాలేదని చెబుతున్నారు. సుందరయ్య నగర్​, పాత సారపాక, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, మోతె, ఇరవెండి, గొమ్మూరు, బూర్గంపాడులలో పరిహారం అందని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్​ లీడర్లు ఇళ్లు మునగక పోయినా లిస్టులో పేర్లు రాయించుకొని పరిహారం తీసుకున్నారని ఆరోపిస్తూ సోమవారం బూర్గంపాడు మండల కేంద్రంలో ఆల్​ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 

భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం(ములుగు), వాజేడు(ములుగు) మండలాల్లో 2,038 కుటుంబాలకు పరిహారం అందలేదు. భద్రాచలంలో 2,913 కుటుంబాల్లో 1,431 కుటుంబాలకు రాగా, మిగిలిన 1482 కుటుంబాలకు రాలేదు. భద్రాచలం టౌన్​లో కరకట్ట కింద అశోక్​నగర్​ కొత్తకాలనీలో 54 కుటుంబాల్లో 12 కుటుంబాలకే పరిహారం ఇచ్చారు. ఈ కాలనీ రెండుసార్లు ముంపునకు గురైంది. సుభాష్​నగర్​ కాలనీలో 300 కుటుంబాలకు డబ్బులు ఇంకా రాలేదు. ఏఎంసీ కాలనీ, శిల్పినగర్​లోనూ ఇదే పరిస్థితి. 

  • దుమ్ముగూడెం మండలంలో 2180 కుటుంబాల్లో 1936 కుటుంబాలకు మాత్రమే సాయం అందింది.
  • చర్ల మండలంలో 2349 ఇళ్లు మునగగా, 2289 ఇళ్లకు పరిహారం అందించారు. గొంపల్లి గ్రామంలో ఇండ్లు నీట మునగని వారికి సాయం ఇచ్చారని బాధితులు ఫిర్యాదు చేశారు.
  • వెంకటాపురం మండలంలో 1002 ఇళ్లు మునిగితే 892 కుటుంబాలకు సాయం చేశారు.
  • వాజేడు మండలంలో 900 ఇళ్లు మునిగితే 758 కుటుంబాలకే పరిహారం అందింది. 
  •  బూర్గంపాడులో 7 వేలు, అశ్వాపురంలో 1458, పినపాకలో 1353, మణుగూరులో 392 ఇళ్లు మునిగాయి.  
  •  అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర, నెల్లిపాక, టేకులగుట్ట గ్రామాల్లో పరిహారం రాలేదు.
  • పినపాక మండలంలో రాయిగూడెం, బయ్యారం, చింతలబయ్యారం, భూపతిరావుపేట, సింగిరెడ్డిపల్లి, టి.కొత్తగూడెం గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 1353 ఇళ్లు మునగగా, 1100 ఇళ్లకు పరిహారం అందింది. మణుగూరు మండలం కమలాపురం గ్రామంలో పలువురికి పరిహారం అందలేదు.

ఇల్లు కూలినా డబ్బులు రాలె

గోదావరి వరదలకు తాటాకు ఇల్లు కూలిపోయింది. మేము బయట ఉంటున్నం. పరిహారం వస్తే బాగు చేయించుకుందామని అనుకుంటే డబ్బులు ఇవ్వలేదు. ఇల్లు ఎట్ల బాగు చేసుకోవాలో అర్థం కావట్లేదు.

- గొడుగు వినయ్
సుభాష్​నగర్​ కాలనీ, భద్రాచలం

పరిహారం ఇచ్చేది ఇట్లేనా?

సర్వం కోల్పోయిన బాధితులకు పరిహారం ఇవ్వకపోవడం సరైంది కాదు. నామ్​కే వాస్తేగా సర్వే చేసి బాధితుల వివరాలు పూర్తిగా తీసుకోలేదు. నిజమైన బాధితులకు ఇవ్వకుండా, ఇళ్లు మునగని వాళ్లకు పరిహారం వచ్చింది. అందరికీ ఇచ్చామని కలెక్టర్​ చెబుతున్నారు. అకౌంట్లలో పడని వారి డబ్బులు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలి.

- పొదెం వీరయ్య, ఎమ్మెల్యే, భద్రాచలం