మంచిర్యాల జిల్లాలో అన్నదమ్ములు చెరువులో గల్లంతు

మంచిర్యాల జిల్లాలో అన్నదమ్ములు చెరువులో గల్లంతు
  • మంచిర్యాల జిల్లాలో అన్నదమ్ములు..  
  •     సాగర్​ ఎడమ కాల్వలో బాలుడు 
  •     వేములపల్లిలో చేపలు పట్టేందుకు వెళ్లి యువకుడు.. 
  •      బైక్​పై హల్దీ వాగు  దాటుతూ మరొకరు.. 
  •      జగిత్యాల జిల్లాలో పూజారి ...
  •     సంగారెడ్డి జిల్లాలో స్నానానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. 
  •     కృష్ణా నదికి వెళ్లి  బాలుడు మృతి

జైపూర్ (భీమారం):  మంచిర్యాల జిల్లాలోని భీమారం మండలం నర్సింగాపూర్ లో దశదిన కర్మకు వెళ్లిన అన్నదమ్ములు చెరువులో గల్లంతయ్యారు. ఏఎస్సై భూమయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దల మాంతయ్య (42) పెద్దల పోచయ్య  (48) అదే గ్రామంలోని సమీప బంధువు దశదినకర్మకు గురువారం వెళ్లారు. స్నానం కోసం ముందుగా చెరువులోకి దిగిన మాంతయ్య లోతు ఎక్కువగా ఉండడంతో గల్లంతయ్యాడు. ఇది చూసిన మాంతయ్య అన్న పోచయ్య తమ్ముడిని బయటకు తీసుకువస్తానని చెరువులో దూకాడు. కొద్దిసేపటికే పోచయ్య కూడా కనిపించకుండా పోయాడు. పోలీసులు గజ ఈతగాళ్లను తీసుకువచ్చి నాటు పడవతో గాలించినా ఆచూకీ దొరకలేదు. ఘటనా స్థలాన్ని శ్రీరాంపూర్ సీఐ, ఎస్సైలు గంగా రాజా గౌడ్, మానస పరిశీలించారు. 

సాగర్‌ ఎడమకాల్వలో..

హాలియా : నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారంలో గురువారం అమ్మమ్మ వెంట సాగర్‌ ఎడమ కాల్వకు వెళ్లిన ఓ చిన్నారి గల్లంతయ్యాడు. ఎస్సై శోభన్‌బాబు కథనం ప్రకారం... పెద్దవూర మండలం నాయనవానికుంటకు చెందిన మేకల బ్రహ్మం భార్యాపిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం నిడమనూరు మండలంలోని ముప్పారం వచ్చాడు. గురువారం బ్రహ్మం అత్త లక్ష్మమ్మ బట్టలుతకడానికి సాగర్‌ ఎడమ కాల్వకు వెళ్తుండగా బ్రహ్మం కొడుకు వెంకట్‌ (10) కూడా వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీళ్లలో గల్లంతయ్యాడు. వెంకట్‌ కోసం గాలిస్తున్నారు.  

చేపలు పట్టేందుకు వెళ్లి.. 

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా వేములపల్లికి చెందిన షేక్‌ పాషా కొడుకు సాజిద్‌ (22) చేపలు పట్టేందుకు గురువారం సమీపంలోని సాగర్‌ ఎడమకాల్వ వద్దకు వెళ్లాడు. మెట్లపై నిలబడి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారి నీటిలో పడ్డాడు. ఓ యువకుడు చూసి సాజిద్‌ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. సాజిద్ ​కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

బైక్​పై రోడ్డు దాటుతుండగా..  

గజ్వేల్​: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట వద్ద గురువారం బైక్​పై హల్దీవాగు దాటుతుండగా యువకుడు గల్లంతయ్యాడు. అనంతగిరిపల్లికి చెందిన ఎల్లంకుల స్వామి (29) ప్లంబర్. గురువారం బైక్​పై నాచగిరి నృసింహస్వామి ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. హల్దీవాగు దాటుతుండగా వరద ఉధృతికి పడిపోయి గల్లంతయ్యాడు. గౌరారం ఏఎస్సై.. గజ్వేల్ ​ఫైర్​స్టేషన్​ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్​ సహకారంతో గాలించినా ఫలితం లేకుండా పోయింది. తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గౌరారం ఎస్ఐ సంపత్​కుమార్ తెలిపారు.  

నిమజ్జనానికి వెళ్లి..

మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలోని మార్కండేయ గుడిలో నవరాత్రులు పూర్తవడంతో అమ్మవారి విగ్రహాన్ని ఎస్ ఆర్ ఎస్ పీ కెనాల్​కు తీసుకువెళ్లారు. నిమజ్జానికి ముందు కెనాల్ లో మెట్లు దిగిన పూజారి బింగి ప్రసాద్(44) అమ్మవారి ఇత్తడి విగ్రహాన్ని శుద్ధి చేస్తున్నాడు.ఈ క్రమంలో జారి కెనాల్ లో పడిపోయాడు. కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూజారికి భార్య, కొడుకు, కూతురు, ఉన్నారు.  

స్నానానికి వెళ్లి...

వట్​పల్లి : సంగారెడ్డి జిల్లా వట్​పల్లి మండలంలోని పోతుల బొగుడలో స్నానానికి వెళ్లిన చింతల మచ్చేందర్​(35) గల్లంతయ్యాడు. శివారులోని చెరువు కు స్నానానికి వెళ్లిన మచ్చేందర్​ సాయంత్రమైనా రాకపోవడంతో కుటుంబసభ్యులు చెరువు కట్ట వద్దకు వెళ్లి చూడగా చెక్ డ్యామ్ కట్టపై చెప్పులు, బట్టలు కనిపించాయి. ఇతడి భార్య విజయ మేరీ,  అత్త నాగమ్మ గాలించినా దొరకలేదు. మరుసటి ఉదయం చెరువు కుంటలో శవమై తేలాడు.  

బండి కడగడానికి వెళ్లి..  

ఆలంపూర్: గద్వాల జిల్లాలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు కృష్ణానదిలోపడి చనిపోయాడు. ఉండవెల్లి ఎస్ఐ బాలరాజ్ కథనం ప్రకారం..మండల పరిధిలోని శేరుపల్లికి చెందిన రామకృష్ణమ్మ, వెంకట్రాముడు దంపతుల కొడుకైన నరేందర్ (17) బుధవారం దసరా పండుగ సందర్భంగా టూ వీలర్​ను శుభ్రం చేసేందుకు గ్రామ సమీపంలోని కృష్ణా నదికి వెళ్లాడు. తర్వాత నదిలో స్నానానికి వెళ్లి మునిగి చనిపోయాడు. నరేందర్ గత సంవత్సరమే 10వ తరగతి పూర్తి చేశారు.