- ప్రశ్నించిన ఆమె భర్తపై కత్తులతో దాడి చేసి హత్య
- నార్సింగి పరిధిలోని మంచిరేవుల
- వారిని వెంబడించిన ఎస్వోటీ కానిస్టేబుళ్లపైనా దాడి
జీడిమెట్ల/ గండిపేట, వెలుగు: నార్సింగి పరిధి మంచిరేవుల, జగద్గిరిగుట్టలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. మంచిరేవుల ఓఆర్ఆర్ వద్ద ట్రాన్స్ జెండర్ పై అత్యాచారానికి యత్నించారు. ప్రశ్నించిన ఆమె భర్తను దారుణంగా హత్య చేసి పారిపోయారు. అక్కడి నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లగా వారిని వెంబడించిన ఎస్వోటీ కానిస్టేబుల్స్ పైనా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. నార్సింగి పీఎస్ పరిధిలో ఉండే ఓ ట్రాన్స్ జెండర్ బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు మంచిరేవుల గ్రామం రక్తమైసమ్మ దేవాలయం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఒంటరిగా నిలబడి ఉంది. అదే టైమ్ లో బైక్ పై వచ్చిన ఇద్దరు దోపిడీ దొంగలు ఆమె మెడపై కత్తి పెట్టి తమతో ఫ్రీగా సెక్స్ చేయాలని బెదిరించారు. అదే టైంలో పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ రావడంతో దొంగలు గమనించి అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు పోలీసులకు జరిగిన విషయం చెప్పింది.
దీంతో పోలీసులు ఆ దొంగల కోసం గాలించారు. తర్వాత బాధితురాలు విషయాన్ని తన భర్త కిశోర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పింది. కిశోర్ తన ఫ్రెండ్ శివరాజ్ ను తీసుకుని స్పాట్‌కు వెళ్లాడు. కిశోర్, శివరాజ్ ఇద్దరూ కలిసి దొంగల కోసం వెతికారు. అదే టైమ్ లో వారికి దొంగలు బైక్‌పై ఎదురుపడ్డారు. తన భార్యతో ఎందుకు అసభ్యంగా ప్రవర్తించావని కిశోర్ రెడ్డి ఆ దోపిడీ దొంగలను అడిగాడు. వారిలో ఒకడైన కరణ్ సింగ్ అనే యువకుడు కత్తి తీసుకుని కిశోర్ రెడ్డి ఛాతీపై దాడి చేశాడు. శివరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతడిపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ కిశోర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. దొంగలు తమ బైక్ ను అక్కడే వదిలేసి పారిపోయారు. తర్వాత మార్గమధ్యలో తులసికుమార్ అనే మరో వ్యక్తిని కత్తితో బెదిరించి రూ.15 వేలు దోచుకున్నారు.
పోలీసులపైనా కత్తులతో దాడి
దొంగలు వదిలివెళ్లిన బైక్ నంబర్ ఆధారంగా వారిని పట్టుకోవడానికి మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి ఎల్లమ్మ బండ, సిక్కు బస్తీలో నిందితులు ఉన్నారని గుర్తించి గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎస్వోటీ కానిస్టేబుల్స్ విజయ్, రాజు నిందితులను పట్టుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో నిందితులు భగవాన్‌సింగ్ అనే వ్యక్తి ఇంట్లో దాక్కున్నారని గమనించి కరణ్‌సింగ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో కరణ్ సింగ్ కత్తితో విజయ్, రాజుపై దాడిచేశాడు. విజయ్ తలకు, రాజుకు ఛాతీపై గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. కరణ్సింగ్తోపాటు మరో వ్యక్తిని అరెస్ట్‌చేశారు.

