ఒక్క బావి వంద బొక్కెనలు

ఒక్క బావి వంద బొక్కెనలు

రుతుపవనాలు ఎంటరైనా.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మాత్రం ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకుంటున్నారు. నాసిక్ పరిధిలోని 8 మండలాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రస్తుతం వెయ్యి 69 గ్రామాలకు కేవలం 325 ట్యాంకర్లు మాత్రమే దాహం తీరుస్తున్నాయి. మరోవైపు జల్ జీవన్ మిషన్ కింద నీటి ఎద్దడి ఉన్న గ్రామాలు గుర్తించామని.. నీటి సరఫరా పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

నాసిక్ జిల్లాలోని తొండవాల్ గ్రామంలో నీటి కోసం ఒకటే బావిపైన గ్రామస్థులు ఆధారపడ్డారు.ఒక్క బావికే.. ఎవరి బొక్కెన వారే వేస్తూ.. నీరు చేదుకుంటున్నారు.ఒకటే బావి ఉండటంతో.. నీటి కోసం విపరీతంగా గొడవలు జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు.నీటి సరఫరా కోసం అప్పుడప్పుడు ట్యాంకర్లు వస్తాయని ఆరోపిస్తున్నారు. పైపు లైన్లు వేసి నీటి సరఫరా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మహారాష్ట్ర నాసిక్ లోని ఖేర్వాడి గ్రామస్థులు తీవ్ర నీటి సమస్య ఎదుర్కొంటున్నారు.బావిలోని మట్టి నీటి కోసం బారులు తీరుతున్నారు. నీటి కోసం 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నామన్నారు మహిళలు. బావిలోకి దిగి నీరు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అంత కష్టపడినా దక్కేది కలుషిత నీరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

నాసిక్ జిల్లాలోని పింపల్ పాడ గ్రామంలో కూడా నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.గ్రామంలోని బావి ఎండిపోవడంతో అడవి నుంచి నీరు తెచ్చుకునేందుకు రోజూ 4 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రహదారి సౌకర్యం లేక నడిచి వెళ్తున్నామని తెలిపారు. నీటి సమస్యతో పాటు, సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. నీటి సమస్య తీర్చి.. రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. మంచినీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి రావడంతో ఉపాధి కోల్పోతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.