
Upcoming IPOs: చాలాకాలం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం తిరిగి స్టార్ట్ అవుతోంది. ఒకపక్క ఈక్విటీ మార్కెట్లు తిరిగి పుంజుకుని లాభాల్లో కొనసాగుతున్న వేళ మరోపక్క ఐపీవోల రాక కూడా క్రమంగా మార్కెట్లోకి పెరుగుతోంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బెట్టింగ్ వేసే ఇన్వెస్టర్లకు తిరిగి మంచికాలం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కొత్త వారం మార్కెట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి 4 ఐపీవోలు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను పరిశీలిస్తే..
బోరానా వీవ్స్ ఐపీవో..
బోరానా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.144.89 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ తన ఐపీవో ద్వారా 67 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో మే 20 నుంచి మే 22 వరకు అందుబాటులో ఉండనుంది. కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.205 నుంచి రూ.216గా ఉంచుతూ లాట్ పరిమాణాన్ని 69 షేర్లుగా నిర్ణయించింది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఒక్కో షేరు రూ.63 ప్రీమియం పలకటంతో ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఐపీవో..
కంపెనీ ఈ ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2వేల 150 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఈ క్రమంలో 23 కోట్ల 89 లక్షల తాజా ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్లకు జారీ చేయాలని నిర్ణయించింది. మే 21 నుంచి 23 వరకు అందుబాటులో ఉండనున్న ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధర షేరుకు రూ.85 నుంచి రూ.90గా ప్రకటించబడింది. అలాగే లాట్ పరిమాణాన్ని కంపెనీ 166 షేర్లుగా నిర్ణయించింది. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వస్తున్న ఐపీవో ప్రస్తుతం గ్రేమార్కెట్లో షేరుకు రూ.17 ప్రీమియం పలుకుతోంది.
డార్ క్రెడిట్ అండ్ క్యాపిటల్ ఐపీవో..
ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఈ ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.57 నుండి రూ.60గా నిర్ణయించబడింది. 2000 షేర్లలో ఒక లాట్ ఉందని కంపెనీ పేర్కొంది. దీని కారణంగా ఏ పెట్టుబడిదారుడైనా కనీసం రూ. లక్ష14వేలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని వెల్లడైంది. ఈనెల 21 నుంచి 23 వరకు అందుబాటులో ఉండనున్న ఐపీవో ఒక్కో షేరుకు గ్రేమార్కె్ట్లో రూ.12 ప్రీమియం పలుకుతోంది.
ఏకీకృత డేటా- టెక్ ఐపీవో..
కొత్తవారం ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న మరో ఐపీవో ఏకీకృత డేటా టెక్. ఈ కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడిదారుల నుంచి రూ.144కోట్ల 47 లక్షలు సమీకరించటానికి 52.92 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ స్టాక్ ప్రైస్ బ్యాండ్ ధర షేరుకు రూ.260 నుంచి రూ.273గా నిర్ణయించబడింది. అయితే గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.175 ప్రీమియం ధరతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.