ఒక్క రోజులోనే రాష్ట్రంలో రూ.78 కోట్ల సొత్తు సీజ్

ఒక్క రోజులోనే రాష్ట్రంలో రూ.78 కోట్ల సొత్తు సీజ్
  • క్యాష్​, డైమండ్స్, లిక్కర్, మత్తు పదార్థాలు స్వాధీనం
  • ఇప్పటి వరకు రూ.243 కోట్లు పట్టుబడినట్లు సీఈఓ ఆఫీస్​వెల్లడి 
  • గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. పది రోజుల్లోనే 100  కోట్లు ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ నగదు, మద్యం, బంగారం, వజ్రాలు, ఉచితాలకు సంబంధించిన వస్తువులు మస్త్​గా పట్టుబడుతున్నాయి. పోలీసులు, ఎలక్షన్​ఆఫీసర్ల టీంలు, ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, తగిన ఆధారాలు చూపకుండా క్యాష్, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్తుంటే స్వాధీనం చేసుకుని సీజ్​ చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలోనే ఏకంగా రూ.78.03 కోట్లు విలువ చేసే క్యాష్, డైమండ్స్, లిక్కర్, మత్తు పదార్థాలు సీజ్​అయ్యాయి.

 దీంతో ఎలక్షన్​ షెడ్యూల్​ వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా మొత్తంగా రూ.243 కోట్ల సొత్తు పట్టుకున్నట్లు సీఈఓ కార్యాలయం వెల్లడించింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇదే హయ్యెస్ట్​. అది కూడా కేవలం 10 రోజుల వ్యవధిలోనే సీజ్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండున్నర నెలల్లో పట్టుబడిన దానికంటే ఎక్కువే పట్టుకున్నారు. అప్పుడు రూ.137 కోట్లు సీజ్​ చేసినట్లు సీఈఓ ఆఫీస్​ వెల్లడించింది. ఇక ఇంకో పది రోజుల్లో నామినేషన్​ ప్రక్రియ మొదలవుతుంది. అప్పటి లోగా ఇంకా తనిఖీలు పెంచాలని ఈసీ ఆదేశించింది. చెక్​ పోస్టులను కూడా పెంచుతున్నారు. 

ఈసారి బంగారం, వజ్రాలు ఎక్కువ పట్టుబడుతున్నయ్

ధారణంగా ఎన్నికల తనిఖీల్లో ఎక్కువగా నగదు, మద్యం, ఉచితాలు ఎక్కువగా సీజ్​ అవుతుంటాయి. అయితే, ఈసారి బంగారం, వజ్రాలు, వెండి వస్తువులు ఎక్కువ మొత్తంలో పట్టుబడుతున్నాయి. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వాటిలో గోల్డ్, డైమండ్స్​ వాల్యూనే రూ.120.40 కోట్లు ఉన్నది. ఇందులో బుధవారం ఒక్క రోజే రూ.57.67 కోట్ల విలువైన వాటిని సీజ్​ చేశారు. ఇందులో 83.046 కిలోల బంగారం, 212.244 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, ప్లాటినం- 5.35 గ్రాములు ఉన్నది. 

ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం మత్తు పదార్థాల విలువ రూ.7.72  కోట్లు, మద్యం విలువ  రూ.10.21 కోట్లు, మొత్తం క్యాష్​  రూ.87.92 కోట్లు, స్వాధీనం చేసుకున్న మొత్తం ఉచితాల విలువ  రూ. 17.48 కోట్లుగా ఉన్నది.