- ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో మొదలైన అడ్మిషన్ల హడావుడి
- ఫీజులపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి
- ప్రభుత్వ పరిశీలనలో విద్యా కమిషన్ సిఫారసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ చదువులు మధ్యతరగతికి మోయలేని భారంగా తయారయ్యాయి. ఏడాదికి10 నుంచి 20 శాతం వరకు ఫీజులు పెంచుతుండంతో చాలా కుటుంబాలు కుదేలవుతున్నాయి. ఫీజుల నియంత్రణకు సంబంధించి గత ప్రభుత్వం కమిటీల పేరుతో పదేండ్లు కాలయాపన చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా కమిషన్ ఏర్పాటు చేయడంతో ఫీజుల నియంత్రణపై ఆశలు చిగురించాయి. దీనిపై గతేడాది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయని ఆశించినా నిరాశే ఎదురైంది.
ఈసారి ఇప్పటికే పలు ప్రైవేట్, కార్పొరేట్స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైనా ఫీజుల నియంత్రణపై సర్కారు మౌనం తల్లిదండ్రులను కలవరపెడుతోంది. విద్యా కమిషన్ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో స్పష్టత కరువైంది. ఇదే అదనుగా కొన్ని యాజమాన్యాలు ఇష్టారీతిన ఫీజులు నిర్ణయిస్తున్నాయి. ఈ క్రమంలో కనీసం వచ్చే విద్యా సంవత్సరానికైనా రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ ఉంటుందా? లేదా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇష్టారీతిగా వసూళ్లు..
రాష్ట్రంలో మొత్తం11,511 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 36.74 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో ఫీజులపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో మేనేజ్మెంట్లు ఇష్టానుసారంగా ఫీజులు నిర్ణయిస్తున్నాయి. జీవో నెంబర్1 ప్రకారం ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా.. యాజమాన్యాలు ఆ ఉత్తర్వులను ఏనాడూ పట్టించుకున్నది లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఫీజులను నియంత్రిస్తామని చెప్పి కమిటీల పేరుతో కాలయాపన చేసింది.
ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదిక ఇచ్చినా.. దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్.. ఫీజుల నియంత్రణపై నివేదిక అందించింది. స్కూళ్లలోని సౌకర్యాల ఆధారంగా ఐదు కేటగిరీలుగా స్కూళ్లను విభజించి, ఫీజులు నిర్ణయించాలని ప్రతిపాదించింది.
రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని.. దానికి చైర్మన్ గా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్‌ను నియమించాలని సూచించింది. ఈ నివేదిక ఇచ్చి సుమారు ఏడాది కావొస్తున్నా.. ఆ సిఫారసులపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. గతంలో వేసిన కమిటీల నివేదికలు ఎలాగూ అమలు కాలేదు, కనీసం ఈ కమిషన్ సూచనలైనా అమల్లోకి వస్తాయా? లేదా? అనే అనుమానాలు పేరెంట్స్ లో మొదలయ్యాయి.
ఇప్పటికే అడ్మిషన్లు షురూ..
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజులపై ఒక విధానం ఉంటే పేరెంట్స్ కు ఊరట లభిస్తుంది. కానీ, ఇప్పటికే చాలా కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించాయి. సీట్లు అయిపోతాయన్న భయంతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ మేనేజ్మెంట్లు అడిగినంత కట్టేస్తున్నారు. ఇప్పటికే పలు స్కూళ్లు ప్రస్తుతమున్న దాని కంటే పది నుంచి 20 శాతం వరకూ ఫీజులు పెంచేశాయి.
ఈ సమయంలో ప్రభుత్వం మౌనంగా ఉండి, విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత నిర్ణయం తీసుకున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, విద్యా కమిషన్ సిఫార్సులను పరిశీలించి, ఫీజుల నియంత్రణపై త్వరగా ఒక నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు.
