పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: ఫారమ్ 16, 26AS మారుతున్నాయి.. కొత్త నంబర్లు ఇవే

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: ఫారమ్ 16, 26AS మారుతున్నాయి.. కొత్త నంబర్లు ఇవే

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త అప్‌డేట్ ఇచ్చింది. దశాబ్దాలుగా మనకు పరిచయమున్న ఇన్‌కమ్ టాక్స్ ఫారమ్ నంబర్లు త్వరలో మారిపోబోతున్నాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం-2025, డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్-2026 ప్రకారం మనకు అలవాటైన ఫారమ్ 16, ఫారమ్ 26AS వంటి పేర్లు కొత్త మార్పులకు గురికానున్నాయి. గందరగోళం లేకుండా ఉండాలంటే పన్ను చెల్లింపుదారులు ముందుగా వచ్చిన ఈ మార్పుల గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం.

ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 నాటి పాత చట్టం స్థానంలో, ఆధునిక అవసరాలకు అనుగుణంగా సరళీకరించిన కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకువస్తోంది. చట్టాన్ని పునర్వ్యవస్థీకరించడంలో భాగంగానే ఈ ఫారమ్ నంబర్లను కూడా మారుస్తున్నారు. అయితే ఫారమ్‌ల పేర్లు మారినా, వాటి ఉద్దేశం, పనితీరు మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది.

కీలకమైన మార్పులు ఇవే:
కొత్త నిబంధనల ప్రకారం మనం నిత్యం వాడే ఫారమ్‌ల నంబర్లు ఇలా ఉండబోతున్నాయి:
* ఫారమ్ 16 → ఫారమ్ 130: జీతగాళ్లకు ఇచ్చే టీడీఎస్ సర్టిఫికేట్ ఇకపై ఫారమ్ 130గా మారుతుంది.
* ఫారమ్ 26AS → ఫారమ్ 168: పన్ను చెల్లింపుల పూర్తి సమాచారం ఉండే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌ను ఇకపై ఫారమ్ 168 అని పిలవాలి.
* ఫారమ్ 16A → ఫారమ్ 131: జీతమేతర ఆదాయాలపై (ఉదా: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ) ఇచ్చే టీడీఎస్ సర్టిఫికేట్ ఫారమ్ 131గా మారుతుంది.
* ఆడిట్ రిపోర్ట్స్ (3CA/3CB/3CD) → ఫారమ్ 26: వ్యాపారవేత్తలకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులన్నీ కలిపి ఫారమ్ 26 కిందకు వస్తాయి.
* ఫారమ్ 24Q → ఫారమ్ 138: జీతాల టీడీఎస్ త్రైమాసిక నివేదిక ఇకపై ఫారమ్ 138.

పాత ఫారమ్‌ల పరిస్థితి ఏంటి..?
2026 ఏప్రిల్ 1 కంటే ముందు కాలానికి సంబంధించిన పన్ను లావాదేవీలు, నోటీసులు లేదా పెనాల్టీల విషయంలో పాత ఫారమ్ నంబర్లే (1961 చట్టం ప్రకారం) కొనసాగుతాయి. అంటే కొన్నాళ్ల పాటు పాత, కొత్త వ్యవస్థలు రెండూ సమాంతరంగా నడుస్తాయి. మీరు ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టాక్స్ పనులు చేస్తున్నారనే దానిపై ఏ ఫారమ్ వాడాలనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదిత మార్పులపై ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ నుంచి ఈ కొత్త ఫారమ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మొదట్లో పన్ను చెల్లింపుదారులకు కొంచెం అయోమయం ఉన్నప్పటికీ.. డిజిటల్ వ్యవస్థలు, FAQల ద్వారా ఈ మార్పులను అందరికీ సులువుగా అర్థమయ్యేలా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.