మాజీ డీఎస్పీ భీమ్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..8 మంది బినామీలపై కేసులు

మాజీ డీఎస్పీ భీమ్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..8 మంది బినామీలపై  కేసులు

హైదరాబాద్: మాజీ డీఎస్పీ భీమ్ రెడ్డి ఆస్తుల వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. భీమ్ రెడ్డికి సంబంధించినట్లు అనుమానిస్తున్న బినామీ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దర్యాప్తును ముమ్మరం చేసింది .  8 మంది భీమ్ రెడ్డి బినామీలపై కేసులు నమోదు చేసింది. ఏసీబీ దర్యాప్తులో సేకరించిన వివరాల ఆధారంగా బినామీలపై ఐటీ శాఖ కూడా కేసులు నమోదు చేసింది

భీమ్ రెడ్డి బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల నివాసాలు, వారికి సంబంధించిన ప్రాంతాల్లో ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులు, నగదు, బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. దర్యాప్తులో లభించిన ఆస్తులు, నగదు, బంగారం వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఆస్తులకు సంబంధించిన ఆదాయ వనరులు, వాటి యాజమాన్యం, లావాదేవీలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. 

భీమ్ రెడ్డితో పాటు ఆయనకు బినామీలుగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్న మొత్తం 8 మందిపై బినామీ చట్టం కింద కేసులు నమోదు చేసింది.   ఏసీబీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలను ఐటీ శాఖ పరిశీలిస్తూ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.  బినామీల పేర్లపై ఉన్న ఆస్తులు వాస్తవానికి భీమ్ రెడ్డికి సంబంధించినవేనా? వాటి కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అనే అంశాలపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.

డీజీపీ కార్యాలయంలో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో భీమ్ రెడ్డిపై  జూన్ 27న ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు, భూములు, ఇళ్లు, బ్యాంకు డిపాజిట్లు తదితర వివరాలను ఏసీబీ గుర్తించింది.16 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.200 కోట్లకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

57 రోజుల పాటు చంచల్గూడ జైలు రిమాండ్లో ఉన్న ఆయన సెప్టెంబర్ 1న బెయిల్ పై  విడుదలయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా బినామీ ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. చార్టెడ్ అకౌంటెంట్ వెంకటేష్ సహా 8 మంది ఇళ్లలో సోదాలు నిర్వహించేందుకు సెర్చ్ వారెంట్లు తీసుకున్నారు. ఈ క్రమంలోనే సోదాలు చేసి భీమ్ రెడ్డి బినామీలపై  కేసు నమోదు చేశారు.