ఆధార్​ లింక్​ లేని పాన్‌కార్డు వేస్ట్‌

ఆధార్​ లింక్​ లేని పాన్‌కార్డు వేస్ట్‌

న్యూఢిల్లీ: 2023 మార్చి 31 నాటికి ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్​ కాని పాన్ కార్డులు పనిచేయవని ఆదాయపు పన్ను శాఖ శనివారం  ప్రకటించింది. ఆదాయ-పన్ను చట్టం 1961 ప్రకారం, మినహాయింపు వర్గం పరిధిలోకి రాని పాన్​కార్డు హోల్డర్లందరూ 31.3.2023లోపు తమ పాన్‌‌‌‌ను ఆధార్‌‌‌‌తో లింక్ చేయడం తప్పనిసరి.  వచ్చే ఏడాది ఏప్రిల్​ నుండి లింక్‌ కాని​ పాన్​కార్డు పనిచేయదని ఐటీశాఖ ప్రకటించింది.   

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అస్సాం, జమ్మూ  కాశ్మీర్  మేఘాలయ రాష్ట్రాల్లో నివసిస్తున్న వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం నాన్- రెసిడెంట్ ఇండియన్లు,   భారతదేశ పౌరుడు కానివాళ్లు 'మినహాయింపు వర్గం' లోకి వస్తారు.  పాన్​కార్డు పనిచేయకపోతే, ఐటీ చట్టం ప్రకారం తీసుకునే అన్ని చర్యలను సంబంధిత వ్యక్తి ఎదుర్కోవాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఈ ఏడాది మార్చి 30న జారీ చేసిన సర్క్యులర్‌‌‌‌లో హెచ్చరించింది. పని చేయని పాన్​కార్డుతో ఐటీ రిటర్న్‌‌‌‌ను ఫైల్ చేయడం కుదరదు. 

పెండింగ్‌‌‌‌లోని రిటర్న్‌‌‌‌లు ప్రాసెస్ కావు.  పెండింగ్‌‌‌‌లో ఉన్న రిటర్నులు జారీ కావు. లోపాలతో కూడిన రిటర్న్‌‌‌‌ల విషయంలో పెండింగ్‌‌‌‌లో ఉన్న ప్రొసీడింగ్‌‌‌‌లు కూడా పూర్తి కావు. అధిక పన్నురేటును భరించాల్సి ఉంటుంది. అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు  కేవైసీ (నో యువర్​ కస్టమర్‌‌‌‌) ముఖ్యం కాబట్టి బ్యాంకులు,  ఇతర ఫైనాన్షియల్ పోర్టల్‌‌‌‌ల వంటి అనేకచోట్ల పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సీబీడీటీ సర్క్యులర్ పేర్కొంది.