వంతెనలు అంతేనా?!..ఏండ్లుగా పునాదులు దాటని వంతెన నిర్మాణాలు

వంతెనలు అంతేనా?!..ఏండ్లుగా పునాదులు దాటని వంతెన నిర్మాణాలు
  •     అడవి బిడ్డలకు తప్పని కష్టాలు
  •     పట్టించుకోని అధికారులు, నేతలు
  •     వర్షాలు పడితే మళ్లీ ఇబ్బందే..

ఆసిఫాబాద్, వెలుగు:  ఎల్​నినో ప్రభావంతో మొఖంచాటేసిన వానలు వారం రోజులుగా అడపాదడపా పడుతున్నాయి. అయితే భారీ వర్షాలు కురిస్తే ఎప్పుడు ఏ వాగు ఉప్పొంగుతుందో, ఏ వరద ముంచెత్తుతుందోనని అడవి బిడ్డలు వణికిపోతున్నారు. ఏటా వర్షాకాలంలో వరదలతో దారులన్నీ మూసుకుపోయి, ఊర్లన్నీ జలదిగ్బంధంలో చిక్కుకొని బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి అనేక గ్రామాల ప్రజలు అరిగోస పడ్డారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా కొన్నేళ్లుగా రోడ్డు, రవాణా సౌలత్ లేక కుమ్రం భీం ఆసిఫాబాద్​జిల్లాలోని అడవి బిడ్డలు సతమతమవుతున్నారు. వాగులపై ఏండ్ల కాలంగా వంతెన నిర్మాణాలు అసంపూర్తిగా నిచిలిపోయాయి.

బాహ్య ప్రపంచానికి దూరంగా..

జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్డు, రవాణా సౌకర్యాలు లేక ప్రతి ఏటా వానాకాలంలో అనేక గ్రామాలు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వంతెనలు పూర్తికాక రోగులు, గర్భిణులు, బాలింతలు సర్కార్ దవాఖానాకు వెళ్లేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యావసరాలు తేవాలన్నా, విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు ఉప్పొంగితే టీచర్లు రాలేని పరిస్థితుల్లో స్కూళ్లు మూతపడుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కనీసం 108కు ఫోన్ చేయాలన్నా సిగ్నల్స్ ఉండవు. ఈ ఏడాది సైతం వంతెనలు పూర్తికాకపోవడంతో ఈ వర్షాకాలంలోనూ వారికి గోసలు తప్పేలా లేవు.

  •  ఆసిఫాబాద్ మండలంలోని గుండి పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు 2007 ప్రారంభించారు. 19 ఏండ్లు గడిచినా పిల్లర్ల దశ దాటలేదు. ఆఫీసర్లు, లీడర్లు పట్టించుకోవడంలేదు. ఏటా వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. 
  • కెరమెరి మండలంలోని అనార్ పల్లి పెద్ద వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు 15 ఏండ్లుగా అసంపూర్తిగానే  ఉంది. వర్షాకాలంలో గిరిజన ప్రజలు వాగులు దాటలేక, మరో దారిలేక బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తోంది. 
  •  చింతలమానేపల్లి మండలం బాబాసాగర్–నాయికపు గూడ గ్రామాల మధ్యలో బ్రిడ్జి పనులు నిధులు లేక మూడేండ్లుగా నిలిచిపోయాయి.
  • కెరమెరి మండలంలోని లక్మాపూర్ పెద్ద వాగుపై 2015లో రూ.3 కోట్లతో చేపట్టిన వంతెన పనులు ఇంకా పూర్తికాలేదు. దీంతో ఆయ గ్రామాల గిరిజనులు ఏటా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను గ్రామస్తులు మంచంపై వాగు దాటిస్తూ దవాఖానకు తరలించాల్సిన దుస్థితి నెలకొంది. అనార్ పెల్లి వాగుపై వంతెన ఏండ్లుగా పూర్తి కాలేదు.

వానకాలం వస్తే వణికిపోతున్నం

ఏటా వానకాలం మాకు తిప్పలు తప్పడం లేదు. వంతెన పూర్తిచేయాలని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెప్పినా పట్టించుకోలే. ఫుల్లుగా వానలు పడితే రాకపోకలు బంద్ అయితయ్. పిల్లల చదువులు ఆగమైతున్నయ్. గర్భిణులు, బాలింతలు, రోగులు దవాఖానకు వెళ్లలేక గోస పడుతున్నరు. అధికారులు, లీడర్లు ఇప్పటికైనా పట్టించుకొని బ్రిడ్జిని పూర్తిచేయాలె.
-వెంకటేశ్వర్, గుండి గ్రామస్తుడు