జిల్లా స్థాయి దవాఖాన్లలో సౌలతులు పెంచాలె

 జిల్లా స్థాయి దవాఖాన్లలో సౌలతులు పెంచాలె
  • కరోనాపై రివ్యూలో అధికారులకు మోడీ ఆదేశం
  • రాష్ట్రాల అధికారులతో కోఆర్డినేషన్ చేస్కోవాలె  
  • హోం ఐసోలేషన్ ను పకడ్బందీగా నిర్వహించాలె 
  • ప్రజలు కరోనా రూల్స్ ఫాలో అయ్యేలా చూడాలె  
  • రాష్ట్రాల్లో పరిస్థితిపై సీఎంలతో మీటింగ్ కు ఏర్పాట్లు చేయాలని ఆదేశం   

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున జిల్లా స్థాయి దవాఖాన్లలో సౌలతులు పెంచాలని, ఈ విషయంలో ఆయా రాష్ట్రాలతో కోఆర్డినేషన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. మైల్డ్, అసింప్టమాటిక్ పేషెంట్లకు హోం ఐసోలేషన్ ను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించి చెప్పాలన్నారు.  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హెల్త్ మినిస్టర్ మన్ సుఖ్ మాండవీయ, ఉన్నతాధికారులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి, దవాఖాన్లలో సౌలతులు, వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రజల ఆరోగ్యంపై దాని ఎఫెక్ట్ వంటి అంశాలపై మీటింగ్ లో చర్చించారు.
టీనేజర్ల(15–18 ఏజ్ వాళ్లు)లో ఏడు రోజుల్లోనే 31% మందికి ఫస్ట్ డోస్ కంప్లీట్ చేయడంపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. వీరికి మిషన్ మోడ్ లో వ్యాక్సినేషన్ ను మరింత స్పీడప్ చేయాలన్నారు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషనరీ డోసులను కూడా మిషన్ మోడ్ లో చేపట్టాలన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి, పబ్లిక్ హెల్త్ అంశాలపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రులతో మీటింగ్ కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మీటింగ్ తర్వాత ఇందులో చర్చించిన అంశాలను ప్రధాని ట్విట్టర్ లో వెల్లడించారు. నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్) వీకే పాల్, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, హోం సెక్రటరీ ఏకే భల్లా, హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ, ఇతర ఉన్నతాధికారులు రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు.