గిల్,అక్షర్ మెరుపులు.. తొలి వన్డే భారత్ ఖాతాలోకి

గిల్,అక్షర్ మెరుపులు.. తొలి వన్డే భారత్ ఖాతాలోకి
  •   ఇంగ్లండ్‌‌పై  6 వికెట్ల తేడాతో ఘన విజయం
  • ఆల్​రౌండ్​ పర్ఫామెన్స్​తో  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా అక్షర్

 

బర్మింగ్​హమ్​ :  ఎడ్జ్‌‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌ను ఓడించింది.    భారత్ మరో 4.4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.   విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్, అక్షర్​ పటేల్ మెరుపుదాడులతో  విజయాన్ని అందించారు. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌‌కు గిల్ దూకుడుతోనే మొదలుపెట్టాడు.  75 బంతుల్లో 80 పరుగులు చేసిన గిల్ సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో మజిల్స్​ పట్టేయడంతో  మైదానం వీడాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ (35), కేఎల్ రాహుల్ త్వరత్వరగా అవుట్ కావడంతో భారత్ కాస్త ఒత్తిడిలో పడింది.  అక్షర్​ పటేల్ (57 నాటౌట్),  సుందర్ (52 నాటౌట్)  ఆఫ్​ సెంచరీలతో ఐదో వికెట్‌‌కు 96 పరుగుల భాగస్వామ్యంతో  జట్టును విజయతీరాలకు చేర్చారు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 61 పరుగులకు వికెట్ కోల్పోకుండా నిలిచింది. అయితే భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకుని కేవలం నాలుగు ఓవర్ల వ్యవధిలో ఇంగ్లండ్‌‌ను 80/5, అనంతరం 107/6 స్థితికి నెట్టేశారు. ఈ దశలో జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) ఏడో వికెట్‌‌కు 121 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును 258 పరుగుల   స్కోరుకు చేర్చారు.  భారత బౌలర్లలో అక్షర్​ పటేల్ నాలుగు వికెట్లు తీసి వన్డేల్లో  అత్యుత్తమ  రికార్డ్​ను నెలకొల్పాడు.  ఈ మ్యాచ్​లో ఆల్​రౌండ్​ పెర్ఫామెన్స్​తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌‌గా నిలిచాడు.  టీ20 సిరీస్ తర్వాత వన్డేల్లో ఇంత మంచి స్టార్ట్​ లభించడం ఆనందంగా ఉందని తెలిపాడు. బౌలింగ్‌‌లో వేగాన్ని మారుస్తూ స్టంప్ టు స్టంప్  బాల్​ వేయడంపై దృష్టి పెట్టానని, అదే నాలుగు వికెట్లు సాధించడం  సహాయపడిందని చెప్పాడు.  ప్రసిద్ధ్ కృష్ణ రెండు, గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు పడగొట్టగా, జస్ప్రీత్ బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌‌తో ఒక వికెట్ సాధించాడు. ఈ విజయంతో ఇటీవల టీ20 సిరీస్‌‌లో ఎదురైన నిరాశ నుంచి భారత్ కోలుకోగా, మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌లో శుభారంభం చేసింది. రెండో వన్డేలోనూ విజయాన్ని అందుకుని సిరీస్‌‌ను కైవసం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

మిడిల్​ టైం వికెట్లే ఓటమికి కారణం: హ్యారీ బ్రూక్

భారత్‌‌తో తొలి వన్డేలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టు వైఫల్యానికి మిడిల్​ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. 20 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడిలో పడ్డామని చెప్పాడు. అయినప్పటికీ జో రూట్, లియామ్ డాసన్ కీలక భాగస్వామ్యంతో జట్టును 260 పరుగుల దాకా తీసుకెళ్లారని ప్రశంసించాడు. ఆ స్కోరు రక్షించగలమనే నమ్మకం తమకు ఉందని, కానీ రెండో ఇన్నింగ్స్‌‌లో పిచ్ నెమ్మదిగా మారడంతో భారత బ్యాటర్లు సులభంగా లక్ష్యాన్ని ఛేదించారని తెలిపాడు. జట్టు ఎంపికను పిచ్ పరిస్థితులకు అనుగుణంగానే చేస్తామని, మరికొన్ని పరుగులు చేసి ఉంటే స్పిన్నర్లు ప్రభావం చూపేవారని అన్నాడు. రెండో వన్డేకు ముందు కార్డిఫ్‌‌లో పిచ్‌‌ను పరిశీలించిన తర్వాతే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటామని, తర్వాత మ్యాచ్‌‌ మంచిగా ఆడుతామని  బ్రూక్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

  • ఇంగ్లండ్: 47.5 ఓవర్లలో 258 ఆలౌట్
  • జో రూట్ – 76* (76)  నాటౌట్​
  • లియామ్ డాసన్ – 68 (83)
  • అక్షర్ పటేల్ – 4/62 
  • భారత్: 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 
  • 262 పరుగులు
  • శుభ్‌‌మన్ గిల్ – 80* (75) – రిటైర్డ్​ హర్ట్​
  • అక్షర్ పటేల్ – 57* (52 ) నాటౌట్
  • వాషింగ్టన్ సుందర్ – 52* (63) నాటౌట్​