టీమిండియా బౌలర్లపైనే భారం.. ఇంగ్లండ్‌‌ టార్గెట్‌‌ 374

టీమిండియా బౌలర్లపైనే భారం.. ఇంగ్లండ్‌‌ టార్గెట్‌‌ 374
  •     రెండో ఇన్నింగ్స్‌‌లో ఇండియా 396 ఆలౌట్‌‌
  •     జైస్వాల్‌‌ సూపర్‌‌ సెంచరీ
  •     ఆకాశ్‌‌ దీప్‌‌, జడేజా, సుందర్‌‌ ఫిఫ్టీలు

లండన్‌‌: ఇంగ్లండ్‌‌తో ఐదో టెస్ట్‌‌లో  ఇండియాను గెలిపించే బాధ్యత బౌలర్ల చేతుల్లో ఉంది.  యశస్వి జైస్వాల్‌‌ (164 బాల్స్‌‌లో 14 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 118) సెంచరీతో అదరగొట్టడంతో  ప్రత్యర్థికి  ఇండియా భారీ టార్గెట్ ఇచ్చింది. జైస్వాల్‌కు తోడు ఆకాశ్‌‌ దీప్‌‌ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (53) రాణించడంతో.. 75/2 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో మూడో రోజు శనివారం ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌లో 88 ఓవర్లలో 396 రన్స్‌‌కు ఆలౌటైంది. జోష్‌‌ టంగ్‌‌ (5/125) ఐదు వికెట్లు పడగొట్టాడు. 374 రన్స్ టార్గెట్ ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లిష్‌‌ జట్టు ఆట ముగిసే టైమ్‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌లో 13.5 ఓవర్లలో 50/1 స్కోరు చేసింది. జాక్‌‌ క్రాలీ (14) ఔట్​ కాగా, బెన్‌‌ డకెట్‌‌ (34 బ్యాటింగ్‌​) క్రీజులో ఉన్నాడు. హోమ్‌‌ టీమ్‌‌ విజయానికి 324 రన్స్‌‌ అవసరం. గాయంతో క్రిస్ వోక్స్ దూరమైన నేపథ్యంలో ఇంకో 8 వికెట్లు తీస్తే  ఇండియా మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2–2తో పంచుకుంటుంది.  మరో రెండు రోజుల ఆట మిగిలున్నా..  ఆదివారమే ఫలితం తేలే చాన్సుంది.  

జైస్వాల్ జోరు.. ఆకాశ్‌‌ అదుర్స్‌‌..

మూడో రోజు జైస్వాల్‌ సెంచరీతో మెరిసినా.. నైట్ వాచ్‌మన్‌ ఆకాశ్‌ దీప్ ఆట హైలైట్ అనొచ్చు. 4 రన్స్‌‌ వ్యక్తిగత స్కోరుతో  ఆట మొదలు పెట్టిన ఆకాశ్‌‌ దీప్‌‌ హాఫ్‌‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భుజం గాయంతో క్రిస్‌‌ వోక్స్‌‌ బౌలింగ్‌‌కు అందుబాటులో లేకపోవడం ఇంగ్లిష్‌‌ జట్టుకు మైనస్‌‌గా మారింది. తొలి రెండు రోజులతో పోలిస్తే పిచ్‌‌ బ్యాటింగ్‌‌కు అనుకూలంగా మారడంతో ఆకాశ్‌‌, జైస్వాల్‌‌ వేగంగా ఆడారు. జోష్‌‌ టంగ్‌‌ బౌలింగ్‌‌లో ఆకాశ్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను థర్డ్‌‌ స్లిప్‌‌లో క్రాలీ డ్రాప్‌‌ చేశాడు. ఇది నాలుగో క్యాచ్‌‌ కావడం గమనార్హం. బాల్‌‌ చాలాసార్లు బ్యాట్‌‌ ఎడ్జ్‌‌ను తాకి థర్డ్‌‌ మ్యాన్‌‌ ప్రాంతంలో పడినా క్యాచ్‌‌ అందుకోలేకపోయారు. లెఫ్టార్మ్‌‌ స్పిన్నర్‌‌ జాకబ్‌‌ బీథెల్‌‌ వేసిన తొలి ఓవర్‌‌లోనే మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా ఫోర్‌‌ కొట్టిన ఆకాశ్‌‌ దీప్‌‌ తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. అయితే అట్కిన్సన్‌ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బందిపడినా అతని బౌలింగ్‌‌లోనే 70 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేయడం విశేషం. చివరకు లంచ్‌‌కు ఒక ఓవర్‌‌ ముందు జెమీ ఒవర్టన్‌‌ (2/98) పక్కటెముకలకు గురి చూసి వేసిన షార్ట్‌‌ బాల్‌‌ను తప్పించుకునే క్రమంలో పాయింట్‌‌ వద్ద అట్కిన్సన్‌‌కు సులభమైన క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో వికెట్‌‌కు 107 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగియగా ఇండియా 189/3తో లంచ్‌‌కు వెళ్లింది. 

గిల్‌‌, కరుణ్‌‌ ఫెయిల్‌‌..

లంచ్‌‌ తర్వాత అట్కిన్సన్‌‌ డబుల్‌‌ స్ట్రోక్ ఇచ్చినా.. క్యాచ్‌‌లు పట్టడంలో ఇంగ్లండ్ ఫీల్డర్లు మళ్లీ ఫెయిలయ్యారు. తొలి బాల్‌‌కే కెప్టెన్ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (11)ను ఔట్‌‌ చేశాడు. గుడ్‌‌ లెంగ్త్‌‌తో వేసిన ఇన్‌‌ స్వింగర్‌‌ గిల్‌‌ ప్యాడ్లను తాకడంతో అంపైర్‌‌ ఎల్బీ ఇచ్చాడు. గిల్‌‌ రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. నాకొత్తగా వచ్చిన కరుణ్‌‌ నాయర్‌‌ (17) క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. అయితే రెండో ఎండ్‌‌లో జైస్వాల్‌‌ తన ఫామ్‌‌ను కొనసాగించడంతో ఇండియా స్కోరు 200లకు చేరింది. దాదాపు10 ఓవర్లు ఈ ఇద్దరు సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేశారు. కానీ రెండోసారి బౌలింగ్‌‌కు దిగిన అట్కిన్సన్‌‌ టైట్ లైన్‌‌లో ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌తో వేసిన బాల్‌‌కు నాయర్‌‌ కీపర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. ఐదో వికెట్‌‌కు 30 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. జడేజా ఆచితూచి ఆడగా, జైస్వాల్‌‌ 127 బాల్స్‌‌లో ఈ సిరీస్‌‌లో రెండో సెంచరీ పూర్తి చేశాడు. 

ఇంగ్లండ్‌‌పై నాలుగోది కాగా ఓవరాల్‌‌గా ఆరోది. కొద్దిసేపటి తర్వాత థర్డ్‌‌ మ్యాన్‌‌ ప్రాంతంలో జైస్వాల్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను వృథా అయ్యింది. కానీ టీ బ్రేక్‌‌కు ముందు టంగ్‌‌ వేసిన షార్ట్‌‌ వైడ్‌‌ బాల్‌‌ను ఆడిన జైస్వాల్‌‌ బ్యాక్‌‌వర్డ్‌‌ పాయింట్‌‌లో ఒవర్టన్‌‌ చేతికి చిక్కాడు. ఆరో వికెట్‌‌కు 44 రన్స్‌‌ జత కాగా, ఇండియా 304/6 స్కోరు చేసింది. ఇక మూడో సెషన్‌‌లో ఇంగ్లిష్‌‌ బౌలర్లు విజృంభించారు. ఐదు ఓవర్ల తర్వాత ధ్రువ్‌‌ జురెల్‌‌ (34)ను ఔట్‌‌ చేసి ఏడో వికెట్‌‌కు 50 రన్స్‌‌ భాగస్వామ్యాన్ని ముగించారు. ఈ దశలో వచ్చిన సుందర్‌‌ వేగంగా ఆడినా రెండో ఎండ్‌‌లో టంగ్‌‌ మళ్లీ దెబ్బకొట్టాడు. 71 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన జడేజాతో పాటు సిరాజ్‌‌ (0)ను 84వ ఓవర్‌‌లో నాలుగు బాల్స్‌‌ తేడాలో వెనక్కి పంపాడు. కొద్దిసేపటికే 39 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన సుందర్‌‌ను చివరి వికెట్‌‌గా ఔట్‌‌ చేసి ఇన్నింగ్స్‌‌కు తెరదించాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 224 ఆలౌట్‌‌. ఇంగ్లండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌: 247 ఆలౌట్‌‌. ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌: 88 ఓవర్లలో 396 ఆలౌట్‌‌ (జైస్వాల్‌‌ 118, జడేజా 53, సుందర్‌‌ 53, టంగ్‌‌ 5/125, అట్కిన్సన్‌‌ 3/127). ఇంగ్లండ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌:  13.5 ఓవర్లలో 50/1(డకెట్​ 34 బ్యాటింగ్​, సిరాజ్​ 1/11).

  • ఒక సిరీస్‌‌లో అత్యధిక రన్స్‌‌ చేసిన ఇండియన్‌‌గా గిల్‌‌ (754), గావస్కర్‌‌ (734) రికార్డును అధిగమించాడు.
  • ఒకే టెస్ట్‌‌ సిరీస్‌‌లో ముగ్గురు  బ్యాటర్లు 500లకు పైగా రన్స్‌‌ చేయడం ఇదే తొలిసారి. గిల్‌‌ (754), రాహుల్‌‌ (532), జడేజా (516) ఈ ఫీట్‌‌ సాధించారు. 
  •  ఆరో నంబర్‌‌ అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌‌కు దిగి 500లకు పైగా రన్స్‌‌ చేసిన ఇండియా బ్యాటర్‌‌ జడేజా. 2002లో విండీస్‌‌పై లక్ష్మణ్‌‌ (474) నెలకొల్పిన రికార్డును బ్రేక్‌‌ చేశాడు. 
  • ఓవల్‌‌ వేదికలో నైట్‌‌ వాచ్‌‌మన్‌‌గా వచ్చిన ఫిఫ్టీ సాధించిన తొలి ఇండియన్‌‌ ఆకాశ్‌‌ దీప్‌‌. ఓవరాల్‌గా రెండో ప్లేయర్.  2011లో అమిత్‌‌ మిశ్రా (84) ఈ ఫీట్‌‌ సాధించాడు. 
  •  ఇంగ్లండ్‌‌ టూర్‌‌లో 10 వికెట్లు, హాఫ్‌‌ సెంచరీ చేసిన 12వ ప్లేయర్‌‌ ఆకాశ్‌‌ దీప్‌‌. హ్యూగ్‌‌ ట్రుంబ్లే, షేన్‌‌ వార్న్‌‌, ఇమ్రాన్‌‌ ఖాన్‌‌, కీత్‌‌ మిల్లర్‌‌, రిచర్డ్‌‌ హ్యాడ్లీ సరసన నిలిచాడు. 
  •  ఐదు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌‌లో ఎక్కువ సెంచరీలు (12) చేసిన నాలుగో జట్టుగా  ఇండియా నిలిచింది. గతంలో ఆసీస్‌‌.. విండీస్‌‌పై (1955), పాకిస్తాన్‌‌.. ఇండియాపై (1982/83), సౌతాఫ్రికా.. విండీస్‌‌పై (2003/04) ఈ రికార్డును నెలకొల్పాయి. 
  • 18 జైస్వాల్‌‌, ఆకాశ్‌‌ మధ్య నెలకొన్న సెంచరీ భాగస్వామ్యం ఈ సిరీస్‌‌లో 18వది. ఈ శతాబ్దంలో ఒక సిరీస్‌‌లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల రికార్డు ఇదే.