ఐదో టెస్ట్ మన సిరాజ్‌‌ గెలిపించాడు..ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌గా హైదరాబాద్ స్టార్‌‌‌‌

ఐదో టెస్ట్ మన సిరాజ్‌‌ గెలిపించాడు..ప్లేయర్ ఆఫ్  ద మ్యాచ్‌‌గా హైదరాబాద్ స్టార్‌‌‌‌
  • ఐదో టెస్టులో టీమిండియా అద్భుత విజయం
  • 6 రన్స్ తేడాతో ఓడిన ఇంగ్లండ్
  • 2–2తో సిరీస్ పంచుకున్న గిల్‌‌సేన
     

లండన్‌‌:  అలుపెరుగని యోధుడల్లే.. అసాధారణ బౌలింగ్‌‌తో హోరెత్తించిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (4/86, 5/104)  ఇంగ్లండ్ గడ్డపై టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. క్లిష్ట సమయంలో జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకొని ఓటమి అంచున ఉన్న మ్యాచ్‌‌లో జట్టును గెలిపించాడు. పోరాట పటిమకు నిలువుటద్దంలా సిరాజ్  చేసిన మ్యాజిక్‌‌తో  ఐదో, చివరి టెస్టులో ఇండియా  6 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌‌పై ఉత్కంఠ విజయం సాధించింది. అత్యంత నాటకీయంగా సాగిన సిరీస్‌‌ను గిల్‌‌సేన 2–2తో పంచుకొని టూర్‌‌‌‌ను గౌరవంగా ముగించింది. 374 టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 339/6తో  సోమవారం, చివరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లిష్ టీమ్ 85.1 ఓవర్లలో 367 రన్స్‌‌కు ఆలౌటైంది. హోమ్‌‌ టీమ్‌‌ను గెలుపు అంచుల వరకూ తీసుకెళ్లిన గస్ అట్కిన్సన్ (17) సహా చివరి నాలుగు వికెట్లలో మూడు పడగొట్టిన సిరాజ్‌‌ హీరోగా నిలిచాడు. మ్యాచ్‌‌ మొత్తంలో 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్‌‌గా నిలిచాడు. ప్రసిధ్ కృష్ణ (4/62, 4/126) కూడా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌‌ల్లో 754 రన్స్‌‌తో అదరగొట్టిన కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. 

56 నిమిషాల థ్రిల్లర్‌‌.. ఇండియానే విన్నర్‌‌

చివరి రోజు ఆట 56 నిమిషాల్లోనే ముగియగా..  ప్రతీ నిమిషం, ప్రతీ క్షణం, ప్రతీ బాల్‌‌ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. ఇంగ్లండ్ విజయానికి కేవలం 35 రన్స్‌‌ అవసరం కాగా.. ఇండియా గెలవాలంటే ఇంకో నాలుగు వికెట్లు పడగొట్టాల్సిన పరిస్థితిలో ఆతిథ్య జట్టుకే మొగ్గు కనిపించింది. పైగా, చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్  ఆఖరి రోజు ఆటకు ముందు పిచ్‌‌పై హెవీ రోలర్‌‌‌‌ ఉపయోగించాడు.  కనీసం అర్ధ గంట అయినా వికెట్‌‌ బ్యాటింగ్‌‌కు అనుకూలించేలా చేశాడు. దానికి తగ్గట్టే ఇంగ్లండ్ బ్యాటర్ ఒవర్టన్ (9).. ప్రసిధ్‌‌ కృష్ణ వేసిన తొలి ఓవర్లోనే రెండు అద్భుతమైన ఫోర్లతో టీమిండియా శిబిరంలో కలవరం రేపాడు. దీంతో సాధించాల్సిన టార్గెట్‌‌ 27 రన్స్‌‌కు  తగ్గింది. ఇక ఓటమి ఖాయం అనుకుంటున్న దశలో కెప్టెన్ గిల్‌‌..  బంతిని సిరాజ్‌‌కు అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ  తన తొలి ఓవర్‌‌తోనే సిరాజ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆఫ్- స్టంప్ ఆవల పడి స్వింగ్‌‌ అయిన ఓ బాల్‌‌తో డేంజర్ మ్యాన్‌‌ జెమీ స్మిత్ (2) బ్యాట్‌‌ నుంచి ఎడ్జ్ రాబట్టాడు. కీపర్ జురెల్ సులభంగా క్యాచ్ అందుకోవడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. సిరాజ్ వేసిన ఆ ఓవర్లోని ప్రతీ బంతి ఒక సంచలనమే అన్నట్లు సాగింది.  ఊపు మీదున్న హైదరాబాదీ తన తర్వాతి ఓవర్లో మరో మ్యాజిక్ చేశాడు. వరుసగా  ఔట్‌‌స్వింగర్లతో ఊరించిన అతను అనూహ్యంగా ఓ ఇన్‌‌ స్వింగర్‌‌‌‌తో ఒవర్టన్‌‌ను ఎల్బీ చేశాడు.  ఆ వికెట్‌‌తో ఇంగ్లిష్ టీమ్ ఆత్మరక్షణలో పడగా.. టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఓవైపు సిరాజ్ విజృంభిస్తుంటే మరో ఎండ్‌‌లో ప్రసిధ్‌‌ కృష్ణ కూడా తన వంతు పాత్ర పోషించాడు. జోష్ టంగ్‌‌ (0)ను ఓ అద్భుతమైన ఫుల్‌‌ లెంగ్త్ బంతితో బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌‌ 350/9తో మరింత డీలా పడేలా చేశాడు.  ఈ టైమ్‌‌లో  విరిగిన ఎడమ చేతికి కట్టుతో, విపరీతమైన నొప్పితో బ్యాటింగ్ చేసేందుకు క్రిస్ వోక్స్(0 నాటౌట్‌) మైదానంలోకి అడుగు పెట్టగా స్టేడియం మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. తను బ్యాటింగ్ చేయలేని స్థితిలో ఉండటంతో మరో ఎండ్‌‌లో ఉన్న  అట్కిన్సన్‌‌పై  భారం మొత్తం పడింది. అతను ఏమాత్రం బెదరకుండా సిరాజ్‌‌ బౌలింగ్‌‌లో  భారీ షాట్ కొట్టాడు. బౌండ్రీ లైన్ వద్ద  ఆకాశ్ దీప్ క్యాచ్ పట్టే ప్రయత్నం చేసినా అది సిక్సర్‌‌గా వెళ్లింది.  దీంతో టార్గెట్ సింగిల్ డిజిట్‌‌కు చేరుకోవడంతో స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంది. ఆ ఓవర్ లాస్ట్ బాల్‌‌కు సింగిల్ తీసి స్ట్రయిక్ నిలబెట్టుకున్న అతను.. ప్రసిధ్ బౌలింగ్‌‌లో డబుల్‌‌, లాస్ట్ బాల్‌‌కు సింగిల్‌‌తో మళ్లీ స్ట్రయిక్‌‌ తీసుకున్నాడు. ఆతిథ్య జట్టు విజయానికి మరో ఏడు రన్స్‌‌ మాత్రమే అవసరం అవ్వడంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. ఈ టైమ్‌‌లో సిరాజ్ నిప్పులు చెరిగే ఒక పర్ఫెక్ట్ యార్కర్‌‌ను సంధించాడు. మెరుపు వేగంతో దూసుకొచ్చిన ఆ బాల్‌‌ అట్కిన్సన్ డిఫెన్స్‌‌ను ఛేదించుకుని నేరుగా ఆఫ్ -స్టంప్‌‌ను ఎగరగొట్టింది. అంతే, ఇండియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌: 224. ఇంగ్లండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌: 247. ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌: 396; ఇంగ్లండ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌ (టార్గెట్‌‌374 ):  85.1 ఓవర్లలో 367 ఆలౌట్‌‌ (హ్యారీ బ్రూక్ 111, జో రూట్ 105, సిరాజ్ 5/104,  ప్రసిధ్ కృష్ణ 4/126).

1  టెస్ట్ క్రికెట్ చరిత్రలో రన్స్‌ పరంగా ఇండియాకు ఇదే లోయెస్ట్ మార్జిన్‌ విక్టరీ (6 రన్స్‌‌). గతంలో 2004లో ఆస్ట్రేలియాపై ముంబైలో 13 రన్స్‌‌ తేడాతో గెలిచిన రికార్డును బ్రేక్ చేసింది. కాగా ఇంగ్లండ్‌‌కు ఇది మూడో లోయెస్ట్ మార్జిన్ ఓటమి.

2  సిరాజ్, ప్రసిధ్‌‌ కృష్ణ ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌‌ల్లోనూ నాలుగేసి వికెట్లు పడగొట్టారు. ఇలాంటి ఘనత సాధించిన ఇండియా రెండో జోడీగా నిలిచారు. గతంలో 1969లో ఆస్ట్రేలియాపై బిషన్ సింగ్ బేడీ– ఎరపల్లి ప్రసన్న ఈ రికార్డు సృష్టించారు.

1 ఈ సిరీస్‌‌లో సిరాజ్ 23 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌‌లో జరిగిన ఒక టెస్ట్ సిరీస్‌‌లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్‌‌‌‌గా బుమ్రా (2021–22లో 23 వికెట్లు) రికార్డు సమం చేశాడు. 

4  ఇండియాపై ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ గెలవకపోవడం ఇది వరుసగా నాలుగోసారి. ఆ టీమ్‌‌ చివరిసారిగా 2018లో ఇండియాపై స్వదేశంలో
 సిరీస్ గెలిచింది. 

తన లాంటి బౌలర్‌‌‌‌..  ప్రతీ కెప్టెన్ కల

సిరాజ్ లాంటి బౌలర్ జట్టులో ఉండటం ప్రతి కెప్టెన్‌‌కు ఒక కల లాంటిది. అతను వేసిన ప్రతి బాల్‌‌లో, ప్రతి స్పెల్‌‌లో తన సర్వస్వాన్ని ఒడ్డి బౌలింగ్ చేశాడు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ లాంటి బౌలర్లు ఉన్నప్పుడు కెప్టెన్సీ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ రోజు మేము స్పందించిన తీరు అద్భుతం. సిరీస్ 2-–2తో సమం కావడం ఇరు జట్ల పోరాటానికి సరైన ముగింపు అని భావిస్తున్నాను. ఈ సిరీస్‌‌లో బుబెస్ట్ బ్యాటర్‌‌గా నిలవాలని  నేను టార్గెట్‌‌గా పెట్టుకున్నా. దాన్ని చేరుకోవడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ ఆరు వారాల నుంచి నేర్చుకున్నది ఏంటంటే - మేము ఎలాంటి పరిస్థితిలోనైనా  పోరాటాన్ని వదలం.   – శుభ్‌‌ మన్ గిల్

గెలిపించాలని గట్టిగా అనుకున్నా..

ఈ రోజు ఉదయం నిద్రలేవగానే నా ఫోన్‌‌లో  బిలీవ్ (నమ్మకం) అని రాసున్న క్రిస్టియానో రొనాల్డో ఫొటోను వాల్‌‌ పేపర్‌‌గా పెట్టుకున్నా.  రొనాల్డో ఎప్పుడూ పోరాటాన్ని వదలడు. ఈ రోజు నేను కూడా అలాంటి మానసిక స్థితిలో ఉండాలనుకున్నా.  ఎలాగైనా దేశం కోసం ఈ మ్యాచ్ గెలిపించాలని నాలో నేను గట్టిగా అనుకున్నా. మ్యాచ్ ఏ దశలో ఉన్నా సరే, మనం గెలవగలమని నాకు పూర్తి నమ్మకం ఉంటుంది. - సరైన ఏరియాల్లో బాల్స్‌‌ వేయాలన్నదే నా ప్లాన్‌. వికెట్లు వచ్చాయా లేదా రన్స్‌‌ ఇచ్చానా అనేది పట్టించుకోలేదు. హ్యారీ బ్రూక్ క్యాచ్ అందుకున్నప్పుడు నా కాలు బౌండరీ లైన్‌‌ను తాకుతుందని అస్సలు ఊహించలేదు. అది ఆటను మలుపు తిప్పిన క్షణం. ఆ తర్వాత మ్యాచ్ మా చేజారిపోయిందనే అనుకున్నా. కానీ దేవుడి దయవల్ల మేము మళ్లీ పుంజుకుని గెలిచాం.– సిరాజ్