IND vs NZ: డారిల్ మిచెల్ సెంచరీ.. భారత్ ముందు టఫ్ టార్గెట్

 IND vs NZ: డారిల్ మిచెల్ సెంచరీ.. భారత్ ముందు టఫ్ టార్గెట్

రెండు అగ్రశ్రేణి జట్ల(భారత్, న్యూజిలాండ్) మధ్య కీలక మ్యాచ్ అభిమానులకు మంచి మజా అందిస్తోంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసినా.. విజేత ఎవరన్నది అంచనా వేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో డారీ మిచెల్(130) సెంచరీతో చెలరేగడంతో భారత్ ముందు.. న్యూజిలాండ్ 274 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒకానొక సమయంలో కివీస్ స్కోర్ 300 దాటుతుందనిపించినా.. ఆఖరిలో భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి కట్టడి చేయగలిగారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లను బుమ్రా, సిరాజ్ జోడి బెంబేలెత్తించారు. ఫామ్‌లో ఉన్న కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే(0), విల్ యంగ్(17) స్వల్ప స్కోరుకే ఔట్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించారు. పవర్ ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోర్.. 34/2. అప్పటివరకూ మ్యాచ్ భారత్ వైపే ఉన్నా.. అక్కడినుండి మెల్లగా న్యూజిలాండ్ వైపు జారుకుంది. 

రచిన్ రవీంద్ర(75), డారీ మిచెల్(130) జోడి 3వ వికెట్ కు 159 పరుగులు జోడించి మ్యాచ్‌ను తమవైపు తిప్పారు. మొదట ఆచి తూచి వీరిద్దరూ.. కుదురున్నాక స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.  దీంతో కివీస్ స్కోర్ 300 దాటుతుందనిపించిపించింది.  అయితే ఇన్నింగ్స్ ఆఖరిలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ 273 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.