Ind vs Pak ఫైనల్: వివాదాస్పదంగా మారిన PVR లైవ్ స్క్రీనింగ్.. శివసేన వార్నింగ్తో ఉత్కంఠ

Ind vs Pak ఫైనల్: వివాదాస్పదంగా మారిన PVR లైవ్ స్క్రీనింగ్.. శివసేన వార్నింగ్తో ఉత్కంఠ

ఆసియా కప్ లో 41 ఏళ్ల తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఒకవైపు చిరకాల ప్రత్యర్థుల ఫైనల్ పోరు కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్. మరోవైపు పహల్గాం దాడి తర్వాత కూడా పాక్ తో మ్యాచ్ ఆడటం ఏంటనే వాళ్లు. ముందు నుంచీ పాక్ తో మ్యాచ్ ను అవాయిడ్ చేయాలనే డిమాండ్ల మధ్యే.. ఇండియా టీమ్ ఆసియా కప్ లో ఆడుతోంది. ఈ క్రమంలో ఎన్నో వివాదాలు, విమర్శలు దాటుకుంటూ ఫైనల్ లో ఆదివారం (సెప్టెంబర్ 28) పాక్ తో తలపడనుంది ఇండియా.

Ind vs Pak ఫైనల్ మ్యాచ్ ను లైవ్ స్క్రీనింగ్ చేయనున్నట్లు పీవీఆర్ సినిమాస్ ప్రకటించడం వివాదానికి దారి తీసింది. ఆదివారం సాయంత్రం 8 గంటల నుంచి పీవీఆర్ సినిమాస్ లో ఫ్యాన్స్ లైవ్ చూడవచ్చునని.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పీవీఆర్ ప్రకటించింది. 

దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. PVR నిర్ణయాన్ని శివసేన పార్టీ తీవ్రంగా తప్పు పట్టింది. ఒకవైపు ఉగ్రవాదుల చేతిలో 26 మంది ప్రాణాలు కోల్పోతే.. పాకిస్తాన్ తో మ్యాచ్ ను లైవ్ స్క్రీనింగ్ చేయడమేంటని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. PVR లో P అంటే పాకిస్తాన్ అన్నట్లుంది.. అందుకే ప్రజల ప్రాణాలు పోయినా కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. 

పీవీఆర్ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన అన్నారు. పహల్గాం దాడిలో చనిపోయిన వారి కుటుంబాలను అవమానించడమేనని విమర్శించారు. పాకిస్తాన్ పై సింపతీ చూపిస్తున్నారనే నెపంతో లడఖ్ పర్యావరణ వేత్త వాంగ్ చుక్ ను అరెస్టు చేశారు.. కానీ పీవీఆర్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మా సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. 

పహల్గాం గాయాలను అప్పుడే మరిచారా..?

పీవీఆర్ నిర్ణయాన్ని దారుణమైన డెసిషన్ గా ఆ పార్టీ నేత ఆదిత్య థాక్రే విమర్శించారు. పహల్గాం గాయాలను అప్పుడే మరిచారా..? అంటూ ప్రశ్నించారు. పహల్గాం బాధితులను, భద్రతా బలగాలను అవమానించడమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.