IND vs SL: మనకు అడ్డేలేదు.. లంకను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్

IND vs SL: మనకు అడ్డేలేదు.. లంకను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్

వేదిక మారొచ్చేమో.. ప్రత్యర్థి జట్టు మారొచ్చేమో.. కానీ ఫలితంలో మాత్రం మార్పు ఉండదు. బాలయ్య సినిమా డైలాగ్‌లా భలే ఉంది కదా! వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ఇదే దూకుడు అనుసరిస్తోంది. మరో మ్యాచ్.. మరో విజయం.. అన్నట్లు దూసుకుపోతోంది. గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు.. లంకేయులపై 302 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ  విజయంతో భారత జట్టు అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు ఒక అగ్రశ్రేణి జట్టుగా పేరొందిన లంక 300 పైచిలుకు పరుగుల భారీ తేడాతో ఓడటం ఇదే తొలిసారి.

358 పరుగుల లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు కనీస పోరాటం కూడా చేయట్లేదు. వచ్చామా.. ఔటయ్యమా.. డగౌట్‌కి పోయామా! అన్నట్లు ఆడారు. లంక బ్యాటర్లలో ఏకంగా ఐదుగురు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారంటే భారత బౌలర్లు ఎలా బంతులేశారో అర్థం చేసుకోవాలి. షమీ, సిరాజ్ పోటీపడి వికెట్లు తీస్తూ లంక ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. 14 పరుగులు చేసిన కసున్ రజిత ఆ జట్టు టాప్ స్కోరర్. నిశ్సాంక(0), దిమిత్ కరుణరత్న(0), సమర విక్రమ(0), కుషాల్ మెండిస్(1), ఏంజెలో మాథ్యూస్(12), చరిత అసలంక(1), దుషన్ హేమంత(0), దుష్మంత చమీరా(0), మధుశంక(5).. ఇవి లంక బ్యాటర్లు చేసిన పరుగులు. 19.3 ఓవర్లలో 55 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లు తీసుకోగా.. సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఏ ఒక్కరూ సెంచరీ చేయకపోయినా.. లంకేయుల ముందు 358 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. శుభ్‌మన్‌ గిల్‌ ( 92; 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ (88; 94 బంతుల్లో 11 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (82; 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.