సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచండి.. మోదీ పిలుపు

సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచండి.. మోదీ పిలుపు

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రజలను కోరారు. ఈ ప్రచార స్ఫూర్తితో ప్రజలు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకానికి మార్చమని ప్రోత్సహించారు. అంతే కాకుండా ప్రధాని మోదీ కూడా తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్ ను జాతీయ జెండాకు మార్చారు.

"హర్ ఘర్ తిరంగా ఉద్యమ స్ఫూర్తితో, మన సోషల్ మీడియా ఖాతాల డీపీని మారుద్దాం. మన ప్రియమైన దేశం, మన మధ్య బంధాన్ని మరింతగా పెంచే ఈ విశిష్ట ప్రయత్నానికి మద్దతు ఇద్దాం" అని మోదీ ట్లిట్టర్ లో రాసుకువచ్చారు. అంతకంటే ముందు, ఆగస్టు 13 నుంచి 15 వరకు జరిగే 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో పాల్గొనాలని ఆగస్టు 11న ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తిరంగా స్వేచ్ఛ, జాతీయ ఐక్యతకు ప్రతీక అని చెప్పారు.

"ప్రతి భారతీయుడికి త్రివర్ణ పతాకంతో భావోద్వేగ అనుబంధం ఉంది. ఇది దేశ ప్రగతికి మరింత కష్టపడి పనిచేయడానికి స్ఫూర్తినిస్తుంది. ఆగస్టు 13 నుంచి 15 మధ్య జరిగే #HarGharTiranga ఉద్యమంలో పాల్గొనాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. తిరంగాతో ఉన్న మీ ఫొటోలను harghartiranga.com లో అప్‌లోడ్ చేయండి' అని మోదీ గతంలో X వేదికగా చెప్పారు.

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేడుకకు ముందు ఢిల్లీలోని ఎర్రకోటలో వివిధ సాయుధ బలగాల పూర్తి డ్రెస్ రిహార్సల్ జరుగుతోంది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూడాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆగస్టు 13న అడ్వైజరీ జారీ చేశారు. మరోవైపు దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.